ముంబై ఇండియన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలానికి ముందే జోష్ తో కనిపిస్తోంది. ఆ జట్టు లోని కోర్ ప్లేయర్లను రిటైన్ చేసుకుని బలమైన పునాది వేసుకుంది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ ఫ్రాంచైజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో పాటు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ తో, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాలను నేరుగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చేర్చుకుంది. మిగిలిన ₹ 45 కోట్ల పర్స్ వాల్యూతో ముంబై ఇండియన్స్ ఎనిమిది మంది విదేశీ క్రికెటర్లతో సహా మరో 20 స్లాట్‌లను భర్తీ చేయాల్సి ఉంది.
IPL 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనుంది. వేలంలో ఏమి జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేనప్పటికీ, ముంబై ఇండియన్స్ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలవెన్ పై ఒక అంచనా అయితే ఉంది.
టీ20 క్రికెట్‌లోని ప్రముఖులందరితో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఆర్డర్ కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ఆ జట్టులో రిటైన్ చేసుకున్న ఆటగాళ్లందరూ ఇంటర్నెషనల్ క్రికెట్ ఆడిన స్టార్ ప్లేయర్లే. ఇక ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్ గా రోహిత్ ఉండగా మరో ఓపెనర్ పాత్ర పోషించడంతో పాటు వికెట్ కీపింగ్ చేసే బ్యాటర్ అవసరముంది. ఫ్రాంచైజీకి ఒక రైట్-టు-మ్యాచ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మతో పాటు పవర్‌ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని అందించగల డాషింగ్ ఓపెనర్ అవసరం. రోహిత్ కి జోడిగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ లేదా ఫిల్ సాల్ట్ ను దక్కించుకోవాలని ముంబై ప్రయత్నించవచ్చు. బట్లర్ గత రెండు ఎడిషన్‌లలో నిరాశపరిచినప్పటికీ, ఫిల్ సాల్ట్ మాత్రం IPL 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఇద్దరు తమదైన రోజు ఎలాంటి బౌలర్ నైనా చీల్చి చెండాడగలరు. ముంబై ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని దక్కించకునే అవకాశముంది.
మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. ఆల్‌రౌండర్‌గా పేరొందిన పాండ్యా మరోసారి ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించనున్నాడు. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో ముంబైకి ఆల్రెడీ మంచి కూర్పు ఉంది.
ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా తమ బ్యాటింగ్ ఆర్డర్ డెప్త్ ని స్ట్రాంగ్ ఉంచుకుంటుంది. ప్రతి సీజన్ లో కూడా లోయర్ మిడిల్ ఆర్డర్ లో భారీ హిట్టర్లను రంగంలోకి దించుతుంది. కాబట్టి నం.6 లో డేవిడ్ మిల్లర్ లాంటి భారీ హిట్టర్ కోసం ప్రయత్నించవచ్చు. ఈ స్థానంలో ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు ఫినిషర్స్ పాత్రలో తనను తాను నిరూపించుకోవడమే కాదు ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా శ్రీలంకకు చెందిన వనిందు హసరంగా లేదా భారత లేటెస్ట్ సంచలనం వాషింగ్టన్ సుందర్ లలో ఒకరిని ఎంచుకోవచ్చు.
ముంబై ఇండియన్స్ నెం.8లో గెరాల్డ్ కోయెట్జీ దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ ప్రోటీస్ పేసర్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. అదనపు బౌన్స్ తో పాటు ఛేంజ్ ఆఫ్ పేస్ తో కోయెట్జీ ప్రత్యర్థి బ్యాటర్‌లను ఇబ్బంది పెట్టగలడు. అవసరమైనప్పుడు తన బ్యాట్ తో పరుగులు చేయగలడు.
పేస్ డిపార్ట్‌మెంట్‌లో అర్ష్‌దీప్ సింగ్ బుమ్రాకు కంపెనీ ఇవ్వగలడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరఫున అర్ష్‌దీప్ 19 వికెట్లు పడగొట్టి, 2024 టీ20 ప్రపంచకప్‌లో 17 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఆల్ రౌండర్ హార్దిక్ కూడా బౌలింగ్ చేయగలడు. ఇక ఈ కూర్పుకి సరిగ్గా సరిపోయే స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.
రోహిత్ శర్మ, జోస్ బట్లర్/ఫిల్ సాల్ట్ (ఓవర్సీస్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్ (ఓవర్సీస్), వనిందు హసరంగ(ఓవర్సీస్)/వాషింగ్టన్ సుందర్, జెరాల్డ్ కోట్జీ (విదేశీ) , యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
జస్ప్రీత్ బుమ్రా ( ₹ 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ ( ₹ 16.35 కోట్లు), హార్దిక్ పాండ్యా ( ₹ 16.35 కోట్లు), రోహిత్ శర్మ ( ₹ 16.30 కోట్లు), తిలక్ వర్మ ( ₹ 8 కోట్లు)