DC Vs GT: ఎవరీ అమన్.? అప్పుడు మ్యాచ్‌ను ఫసక్ చేశాడు.. ఇప్పుడు తోపు ప్లేయర్‌లా జట్టును గెలిపించాడు..

|

May 03, 2023 | 8:47 AM

చివరి ఓవర్‌లో GT విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియా వెటరన్ ఇషాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లు రాహుల్ టేవాటియా, హార్దిక్ పాండ్యాలను కట్టడి చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్‌ను ఎదుర్కోవడంలో ఢిల్లీకి..

DC Vs GT: ఎవరీ అమన్.? అప్పుడు మ్యాచ్‌ను ఫసక్ చేశాడు.. ఇప్పుడు తోపు ప్లేయర్‌లా జట్టును గెలిపించాడు..
Dc Vs Gt
Follow us on

ఐపీఎల్‌-2023లో భాగంగా మంగళవారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో GT విజయానికి 12 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియా వెటరన్ ఇషాంత్ శర్మ అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లు రాహుల్ టేవాటియా, హార్దిక్ పాండ్యాలను కట్టడి చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్‌ను ఎదుర్కోవడంలో ఢిల్లీకి.. ఆ జట్టు కీలక ప్లేయర్స్ అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ ప్రధాన పాత్ర పోషించగా.. బ్యాటింగ్‌లో అమన్ హకీమ్ ఖాన్ మెయిన్ రోల్ ప్లే చేశాడు. ఈ మ్యాచ్‌లో అమన్ జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు.. గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కుని హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లకు ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేయగలిగింది.

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మునపటి మ్యాచ్ ఫామ్‌ను ఢిల్లీ బ్యాటర్లు కొనసాగిస్తారని అందరూ ఊహించగా.. దానికి విరుద్దంగా క్యాపిటల్స్ జట్టు 23 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అక్షర్ పటేల్‌ను జోడిగా క్రీజులోకి వచ్చాడు అమన్ హకీమ్ ఖాన్. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొత్తం జట్టు స్కోరు 73 పరుగుల వద్ద అక్షర్ పటేల్ ఔటయ్యాడు. అతడు 30 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 27 పరుగులు చేశాడు.

అయితే ఆ తర్వాత అమన్ హకీమ్ ఖాన్ మాత్రం పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. మరో సహచర ఆటగాడు రిప్పల్ పటేల్(23) సహకారం అందించడంతో.. వీరిద్దరూ కలిసి మరో 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే అమన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇదే తొలి అర్ధ సెంచరీ. రిప్పల్ పటేల్, అక్షర్ పటేల్‌తో కలిసి అమన్ ఈ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలం అయి ఉంటే.. కచ్చితంగా ఢిల్లీ ఓటమిపాలయ్యేది.

గతంలో హైదరాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పేలవమైన షాట్‌కు వికెట్ కోల్పోయిన అమన్.. ఈసారి అలాంటి తప్పు ఏమి చెయ్యకుండా.. తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడని నెటిజన్లు అతడి ఆటతీరును ప్రశంసిస్తున్నారు.

శార్దుల్ ఠాకూర్‌కు బదులుగా..

గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌లో భాగమైన అమన్ హమీన్ ఖాన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ తమ దగ్గర ఉన్న కీలక ఆటగాడిని మెగా వేలానికి ముందుగా ట్రేడ్ చేసిన విషయం తెలిసిందే. అమన్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండూ చేస్తాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడ్ని ట్రేడ్ చేసుకునేందుకు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను వదులుకుంది. ఢిల్లీ టీం కోచ్ రికీ పాంటింగ్‌ను అమన్‌ కేవలం రెండు నెట్ సెషన్‌లతోనే తన బ్యాట్‌తో మెప్పించాడు. కాగా, 2021లోనే అమన్ లిస్టు-ఏ, టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సంవత్సరం కేకేఆర్ అతడ్ని ఆక్షన్‌లో కొనుగోలు చేసింది. గత ఐపీఎల్ సీజన్‌లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు.