IPL 2023: ఈ సారైనా ‘ముంబైకి తొలి గండం’ గట్టెక్కేనా..? హిట్‌మ్యాన్‌పైనే అభిమానుల ఆశలు..!

|

Apr 02, 2023 | 1:22 PM

ముంబై ఇండియన్స్‌కి ఐపీఎల్‌లో అదిరిపోయే రికార్డు ఉంది. రోహిత్ నాయకత్వంలోనే ముంబై ఏకంగా 5 ట్రోఫీలను కైవసం చేసుకుంది. అయితే అదే హిట్‌ మ్యాన్ టీమ్‌ ఓ చెత్త రికార్డును కూడా మూట గట్టుకుంది. అదేమిటంటే..

IPL 2023: ఈ సారైనా ‘ముంబైకి తొలి గండం’ గట్టెక్కేనా..? హిట్‌మ్యాన్‌పైనే అభిమానుల ఆశలు..!
Mumbai Indians
Follow us on

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక టైటిల్స్ గెలిచిన టీమ్‌ ముంబై ఇండియన్స్‌ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ సందర్భంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ రోజు బరిలోకి దిగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రోహిత్ సేన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక రోహిత్ శర్మ నేతృత్వలోని ముంబై ఇండియన్స్‌కి ఐపీఎల్‌లో అదిరిపోయే రికార్డు ఉంది. అతని నాయకత్వంలోనే ముంబై ఏకంగా 5 ట్రోఫీలను కైవసం చేసుకుంది. అయితే అదే హిట్‌ మ్యాన్ టీమ్‌ ఓ చెత్త రికార్డును కూడా ఈ లీగ్‌లో కొనసాగిస్తోంది. అదేమిటంటే.. ముంబై ఇండియన్స్‌కి ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్ ఓడిపోయే సాంప్రదాయం. అవును, ముంబై టీమ్ తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయే పరంపరను 2013 నుంచీ కూడా కొనసాగిస్తోంది.

2009 నుంచి 2012 మధ్య కాలంలో టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లను గెలిచిన ముంబై.. తర్వాత వరుసగా ఓడుతూ వస్తోంది. ఐపీఎల్ 2013లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో 2 పరుగులతో ఓడిన ముంబై.. ఆ తర్వాత జరిగిన ప్రతి సీజన్‌లోనూ ఇలాగే ఎవరితో తొలి మ్యాచ్‌ ఆడినా ఓడిపోతూనే వచ్చింది. 2014, 2015 ఐపీఎల్ సీజన్లలో ముంబైని తన తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓడించింది. ఇక 2016, 17లలో రైజింగ్‌ పుణె సూపర్‌జెయింట్స్‌ ఆ పని చేసింది. 2018లో ఈ సాంప్రదాయాన్ని ముంబై బ్రేక్‌ చేసేలా కనిపించినా.. ఆ సీజన్‌ తొలి మ్యాచ్‌లో ముంబైపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ వికెట్‌ తేడాతో గెలిచింది.

అలాగే 2019 ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 37 రన్స్‌తో ముంబైని ఓడించింది. 2020లో మరోసారి సీఎస్‌కే చేతుల్లోనే రోహిత్‌ సేనకు ఓటమి తప్పలేదు. ఐపీఎల్ 2021లో కూడా ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో ముంబైని వారి తొలి మ్యాచ్‌లోనే ఓడించింది. ఇక, గతేడాది అంటే సీజన్ 15 ఐపీఎల్‌లో కూడా మరోసారి ముంబై తన తొలి మ్యాచ్‌ని ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్‌ అనూహ్య విజయం సాధించింది. దీంతో వరుసగా పదో సీజన్‌లోనూ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది ముంబై ఇండియన్స్‌.

ఇవి కూడా చదవండి

కాగా, చివరిసారిగా ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ ఎప్పుడు గెలిచిందంటే.. 2012లో టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో హర్భజన్ సింగ్ కెప్టెన్సీలో ముంబై బరిలోకి దిగింది. ఆ మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. ఆ తర్వాత ముంబైని సచిన్ టెండూల్కర్, డ్యయెన్ బ్రావో, రిక్కీ పాంటింగ్ నడిపించారు. వారు కూడా ఆ రికార్డును కొనసాగిస్తూనే వచ్చారు. చివరికీ ఎంతో విజయవంతమైన రోహిత్ శర్మ కూడా ఈ చెత్త రికార్డును అంతం చేయలేకపోయాడు. అయితే ఈ రోజు ఆర్సీబీతో జరిగే మ్యాచ్ సందర్భంగా రోహిత్ ఈ చెత్త రికార్డుకు స్వస్తిపలకాలని చూస్తున్నాడు. అటు ముంబై ఫ్యాన్స్ కూడా హిట్ మ్యాన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..