కారణాలు అటుంచితే.. జట్టులో స్వల్ప మార్పులు చేసేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో విలియమ్సన్ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. దీంతో రూ. 14 కోట్ల భారీ ధరతో ఐపీఎల్ 2022లో అట్టిపెట్టుకున్న విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. అతడితో పాటు విండీస్ ఆటగాళ్లు నికోలాస్ పూరన్(రూ. 10 కోట్లు), రొమారియో షెపర్డ్ లను హైదరాబాద్ యాజమాన్యం రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ మినీ వేలంలో కేన్ విలియమ్సన్‌ను దక్కించుకునేందుకు 3 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. లిస్టులో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ముందు ఉండగా.. సన్‌రైజర్స్ కూడా ఇందులో ఉండటం గమనార్హం.
డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్.. నెంబర్ 3 స్పాట్‌లో చాలామంది ఆటగాళ్లను ప్రయత్నించింది. మొదటిగా ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌ను ప్రయత్నించగా.. అతడు విఫలమయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, వేడ్ తమ అదృష్టాలను పరీక్షించుకోగా.. ఎక్కడా ప్రయోజనం లేకపోయింది. అంతేకాదు ఓపెనింగ్ జోడీ కూడా గుజరాత్‌ను ఎక్కువ ఇబ్బంది పెడుతోంది. గిల్‌తో పాటు యాంకర్ రోల్ పోషించేందుకు సరైన ఆటగాడు ఆ జట్టులో లేడు. ఇక ఈ రెండు పాత్రలకు కేన్ విలియమ్సన్ సరిగ్గా సరిపోతాడు.
ఓపెనర్‌గానైనా.. నెంబర్ 3 పొజిషన్‌లోనైనా కేన్ మామ ఆటతీరు అద్భుతం.. ఇందుకు పలు అంతర్జాతీయ మ్యాచ్‌లే నిదర్శనం. జట్టు మిడిల్ ఆర్డర్ హార్దిక్ పాండ్యా, మిల్లర్, వేడ్, టేవాటియా లాంటి హిట్టర్స్‌తో ఉండగా.. కేన్ టాప్ ఆర్డర్‌లో బాగా సెట్ అవ్వగలడు. అలాగే కావాల్సిన సమయాల్లో యాంకర్ రోల్ పోషించగలడు. అటు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు కూడా తన అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వగలడని గుజరాత్ యాజమాన్యం భావిస్తోంది. అందుకే వేలంలో విలియమ్సన్‌పై గురి పెట్టింది.
చెన్నై ఫ్రాంచైజీ ప్రస్తుతం కెప్టెన్ కోసం తీవ్రంగా వెతుకుతోంది. రవీంద్ర జడేజా ప్రయోగం విఫలం కావడం.. వచ్చే ఏడాది తర్వాత ధోని లీగ్ నుంచి నిష్క్రమణ అయ్యే అవకాశం ఉండటంతో.. కెప్టెన్‌గా విలియమ్సన్ సరిగ్గా సరిపోతాడని చెన్నై యాజమాన్యం భావిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ గతంలోనూ కేన్‌పై ఆసక్తిని కనబరిచింది. కానీ ధర ట్యాగ్ ఎక్కువైపోవడంతో వెనుదిరిగింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో విలియమ్సన్ పేలవమైన ప్రదర్శన కారణంగా, అతడి ధర తగ్గే అవకాశం ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని సీఎస్‌కే భావిస్తోంది. ఒక్క కెప్టెన్‌గా మాత్రమే కాదు.. చెన్నై జట్టుకు అతడి బ్యాటింగ్ నైపుణ్యం, మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లే విధానం సరిగ్గా సరిపోతుంది. ధోనిలాగే మ్యాచ్‌ను విలియమ్సన్ కూడా చివరి వరకు తీసుకెళతాడు. అందుకే కివీస్ కెప్టెన్‌ను రాబిన్ ఉతప్ప స్థానంలో ప్లేయింగ్ XIలోకి తీసుకోవాలనుకుంటోంది చెన్నై.
కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అతడి అధిక ధర(14 కోట్లు) కారణంగానే ఫ్రాంచైజీ వదులుకుంది. అయితే, వేలంలో హైదరాబాద్ కేన్ మామను తక్కువ ధరకు తీసుకోగలిగితే.. జట్టులోకి పునరాగమనం చేసే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ కంటెన్‌డర్‌లో మాత్రం కేన్ లేడు. నివేదికల ప్రకారం, బెన్ స్టోక్స్‌ను వేలంలో చేజిక్కించుకోవాలని.. అతడ్ని కెప్టెన్ చేయాలని హైదరాబాద్ యాజమాన్యం భావిస్తోందట. కానీ స్టోక్స్ లభ్యత, గాయాలు యాజమాన్యానికి ఆందోళన కలిగించే అంశాలు.. అందుకే స్టోక్స్‌కు సరైన బ్యాకప్‌గా కేన్ విలియమ్సన్‌ను చేయాలని చూస్తోంది.