ఐపీఎల్ 2022(IPL 2022) ప్రారంభానికి ప్రస్తుతం ఒక నెల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం 10 జట్లకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 26 నుంచి ప్రారంభమవుతాయి. కానీ, ఇప్పటికీ 10 జట్లలో ఒక టీంకు కెప్టెన్ ఎవరో ఇప్పటికీ తెలియదు. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు. మూడుసార్లు ఐపీఎల్ ఫైనలిస్ట్ అయిన RCBకి ఈ సీజన్ కెప్టెన్‌ను ఇంకా ప్రకటించలేదు. ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli) కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీని తరువాత, ఐపీఎల్ 2022 వేలం తర్వాత కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని ఆశించారు. అయితే కెప్టెన్సీ కోసం బలమైన పోటీదారుగా ఉన్నవారిని RCB దక్కించుకోలేకపోయింది.
వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను ఆర్‌సీబీ అట్టిపెట్టుకుంది. అదే సమయంలో, వేలంలో దినేష్ కార్తీక్, ఫాఫ్ డు ప్లెసిస్ రూపంలో సీనియర్ ఆటగాళ్లను తీసుకున్నారు. వీరిలో మ్యాక్స్‌వెల్, కార్తీక్, డు ప్లెసిస్‌లు కెప్టెన్సీకి పోటీదారులుగా ఉన్నారు. మాక్స్‌వెల్, డు ప్లెసిస్‌లు విదేశీ ఆటగాళ్లే అయినప్పటికీ వీరిలో ఎవరైనా కెప్టెన్‌గా వ్యవహరిస్తే ఆ జట్టు కలయికపై ప్రభావం పడే ఛాన్స్ ఉంది. ఇన్ని కారణాల వల్ల దినేష్ కార్తీక్ చీఫ్ కావడానికి గట్టి పోటీదారుగా ఉన్నాడు. అతను గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతంలో ఆర్సీబీ తరఫున కూడా ఆడాడు.
కార్తీక్ కెప్టెన్సీ రికార్డులు ఎలా ఉన్నాయంటే?
దినేష్ కెప్టెన్సీ కేకేఆర్‌ను 2018లో ప్లేఆఫ్‌కు చేర్చాడు. అదే సమయంలో, దేశవాళీ క్రికెట్‌లో అతని కెప్టెన్సీలో తమిళనాడు జట్టు చాలా విజయవంతగా రాణించింది. ఈ కోణంలో, దినేష్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కావచ్చని తెలుస్తోంది. డు ప్లెసిస్ కూడా బలమైన పోటీదారుగా ఉన్నాడు. అతను ప్రపంచంలోని అనేక విభిన్న లీగ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతను దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అతను చాలా విజయాలు అందుకున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ గురించి మాట్లాడితే, అతని ఫామ్ అతనికి వ్యతిరేకంగా ఉంది. 2013 నుంచి ఐపీఎల్‌లో భాగమైన అతను ఒకటి, రెండు సీజన్‌లు మినహా పెద్దగా రాణించలేకపోయాడు.
కోహ్లీ మళ్లీ కెప్టెన్ అవుతాడా?
విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూసే అవకాశం కూడా ఉంది. RCB మేనేజ్‌మెంట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్సీని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది తాత్కాలికంగా చేసే అవకాశం ఉంది. అయితే కోహ్లీ కెప్టెన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. పనిభారం కారణంగా కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌సీబీ ఎవర్ని సారథిగా చేయనుందో చూడాలి.