ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ప్రస్తుతం ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. గ్రూప్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు ముగిశాయి. ఇక ప్లేఆఫ్ కోసం నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ (GT) మొదటి స్థానంలో నిలవగా, రాజస్థాన్ రాయల్స్ (RR) రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. ఇక మూడో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), 4వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉన్నాయి. టాప్-2 జట్లకు ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. మిగిలిన రెండు జట్లు మూడు మ్యాచ్‌లు గెలిచి లిస్టులో చేరాల్సి ఉంటుంది.
ఇటువంటి పరిస్థితిలో ఎలిమినేటర్ ఆడుతున్న జట్టు టైటిల్ గెలవడం చాలా కష్టం. ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ ఆడుతున్న జట్టు టైటిల్‌ను గెలిచిన సందర్భం ఒక్కసారి మాత్రమే నమోదైంది. 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ ఘనతను సాధించింది. అప్పుడు జట్టు కెప్టెన్సీ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేతిలో ఉంది.
ఫైనల్లో బెంగళూరు జట్టును ఓడించి..
2016 సీజన్‌లో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఈ జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2లో గుజరాత్ లయన్స్‌తో తలపడగా, 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటువంటి పరిస్థితిలో, టైటిల్ కోసం ఫైనల్‌లో, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పోటీపడగా, ఇందులో సన్‌రైజర్స్ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది.
ఈసారి ఈక్వేషన్ ఎలా ఉందంటే?
ఐపీఎల్ 2022 సీజన్‌లో టాప్-2 జట్లైన గుజరాత్, రాజస్థాన్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ ఈరోజు (మే 24) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం దక్కుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. మే 25న కోల్‌కతాలోనే లక్నో, బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.