IPL 2022, Orange Cap: ఐపీఎల్ 2022లో ఆటగాళ్ల బ్యాటింగ్ శైలిని చూస్తే ఈ సీజన్‌లో ఇంకా చాలా పెద్ద రికార్డులు బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్‌ని కొనసాగిస్తున్నాడు. రెండో స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇద్దరి మధ్య 137 పరుగుల తేడా ఉంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఆరెంజ్ క్యాప్ జాబితాలోకి దూసుకొచ్చాడు. ఐదో స్థానం సాధించి అందరికి హెచ్చరికలు జారీ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి ఐదు వరుస ఓటముల తర్వాత గెలిచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో పాటు కేకేఆర్‌కు చెందిన నితీశ్ రాణా, రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్‌లు కనిపించాయి. ఆరెంజ్ క్యాప్ పరంగా కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమైంది.
అయ్యర్, సంజు శాంసన్ లాభపడ్డారు
ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్ 22 పరుగులు చేశాడు. ఈ స్వల్ప ఇన్నింగ్స్ కారణంగా కేఎల్ రాహుల్ అతడి సమీపంలోకి వచ్చాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ 49 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు చేశాడు. దీంతో 10 మ్యాచుల్లో 298 పరుగులు చేసి టాప్ 10లోకి వచ్చాడు. అదే సమయంలో KKR కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడి 32 బంతుల్లో 34 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ యువ స్టార్ తిలక్ వర్మలను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకున్నాడు.
బట్లర్ ఆధిపత్యం
ఆరెంజ్ క్యాప్ రేసులో జోస్ బట్లర్ ముందున్నాడు. 10 మ్యాచ్‌లు ఆడి 588 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సిక్సర్లు కొట్టడంలో కూడా బట్లర్ ముందున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 36 సిక్సర్లు కొట్టాడు. అతని తర్వాత రస్సెల్ 22 సిక్సర్లు కొట్టాడు. KL రాహుల్ ఖచ్చితంగా అతనికి సవాల్ విసురుతున్నాడు కానీ చివరి వరకు ఏం జరుగుతుందో వేచిచూడాలి.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి