Mumbai Indians: హేమాహేమిల్లాంటి ఆటగాళ్లున్నారు.. మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపు తిప్పగల ప్లేయర్లున్నారు. కానీ ఎక్కడో తేడా కొడుతోంది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వరుస ఓటములకు కారణం ఏంటో క్రీడా విశ్లేషకులకు కూడా అంతుచిక్కడం లేదు. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్, టోర్నీలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న రోహిత్ సేన ఐపీఎల్-2022లో మొదటి విజయం కోసం ముఖం వాచిపోయేలా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ముంబై అన్నింటిలోనూ పరాజయం పాలైంది. తాజాగా లక్నో (LSG vs MI) తో జరిగిన మ్యాచ్‌లోనూ 36 పరుగుల తేడాతో ఓటమిపాలై ఈ సీజన్‌లో మెగా లీగ్ నుంచి నిష్ర్కమించిన మొదటి జట్టుగా నిలిచింది. ఈక్రమంలో వరుస ఓటములకు కారణాలను అన్వేషించే పనిలో పడింది టీం మేనేజ్‌మెంట్. కనీసం వచ్చే మ్యాచ్‌ల్లోనైనా గెలుపొంది పరువు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.
సమష్ఠి వైఫల్యంతో..
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్.. ఇలా ఎందరో మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్లు ముంబై జట్టులో ఉన్నారు. అయితే బ్యాటింగ్‌లో సూర్యకుమార్, బౌలింగ్‌లో బుమ్రా తప్పితే మిగతా ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. అటు కెప్టెన్‌గా, ఇటు ఆటగాడిగా హిట్‌మ్యాన్ వైఫల్యం ముంబై జట్టును బాగా దెబ్బతీసింది. ఇక రూ.15 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఇషాన్ కిషాన్ ఆరంభ మ్యాచ్‌ల్లో రాణించి ఆతర్వాత ఉసూరుమనిపించాడు. ఒకప్పుడు ఒంటిచేత్తో విజయాలు అందించిన కీరన్ పొలార్డ్ జట్టుకు భారంగా తయారయ్యాడు. కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా ఆకట్టుకోలేదు. మెరుపులు మెరిపిస్తాడనుకున్న జూనియర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ అడపాదడపా మాత్రమే రాణించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ రాణించినా ఇతర ఆటగాళ్లు సహకరించలేదు. ఇక బౌలింగ్ విభాగంలో బుమ్రా పూర్తిగా ఒంటరివాడైపోవడంతో ముంబై వరుస ఓటములు మూటగట్టుకుంది. జట్టు ఆటగాళ్ల మధ్య లుకలున్నాయని, అందుకే ఆ జట్టు విజయాలు సాధించడం లేదని ముంబై మాజీ ఆటగాడు క్రిస్‌లిన్ చేసిన ప్రకటనలు ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.
పరువు కోసమైనా..
ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నోచేతిలో ముంబై ఘోరంగా ఓడిపోయింది. సూపర్ జెయింట్స్ టీమ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగి ఆ జట్టుకు మరో విజయాన్ని అందించాడు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు గట్టి పునాది వేశాడు. కేవలం 62 బంతుల్లోనే 103 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 4 కళ్లు చెదిరే సిక్సర్లు, 12 బౌండరీలతో విరుచుకుపడ్డాడు రాహుల్. లక్నో టీమ్‌లో మనీష్‌పాండే 22 పరుగులు చేశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీమ్‌లో రోహిత్‌శర్మ, తిలక్ వర్మ మాత్రమే పర్వా లేదనిపించే స్కోర్ చేశారు. రోహిత్ 39, తిలక్‌వర్మ 38 పరుగులు చేశారు. మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేస్‌లోకి ఎగబాకింది లక్నో. మరోవైపు ముంబై అట్టడుగు స్థానంలోనే కొనసాగుతోంది. మరి 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై వచ్చే మ్యాచ్‌లో నైనా బోణి కొడుతుందా? విజయాలు సాధించి పరువు దక్కించుకుంటుందా? లేదా అనేది చూడాలి.
Also Read:
PM Ujjwala Yojana: ఈ పథకంలో 14 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు.. దరఖాస్తు చేసుకోడం ఎలా..?
Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు చుక్కెదురు.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
Crime News: దుర్మార్గుడు.. వంద రూపాయల కోసం కన్నతల్లినే కడతేర్చాడు.. ఎక్కడ జరిగిందంటే..