Mumbai Indians vs Lucknow Super Giants Score: ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో తొలిసారి ఎంట్రీ వరుస విజయాలను అందుకుంటున్న లక్నో తన ఫామ్‌ను మరోసారి కొనసాగించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో ధీటుగా ఆడింది. లక్నో బ్యాట్స్‌మెన్ రాణించడంతో ముంబై ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముఖ్యంగా రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణించి జట్టు స్కోరును భారీగా పెంచేశాడు. ఈ క్రమంలోనే సింగిల్స్ తీస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే రాహుల్ కేవలం 33 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మూడు ఫోర్‌లు, మూడు సిక్స్‌లతో రాహుల్ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. అనంతరం ఏమాత్రం దూకుడు తగ్గకుండా పరుగుల ప్రవాహం పారించాడు. ఈ క్రమంలోనే కేవలం 57 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తనదైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరును అందించాడు. 60 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇలా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు సాధించింది.
ఇక అంతకు ముందు ఓపెనర్‌గా అడుగుపెట్టిన క్వింటన్ డి కాక్ లక్నోకు మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. రాహుల్‌తో కలిసి జట్టు స్కోర్ పెంచాడు. కేవలం 13 బంతుల్లోనే 24 పరుగులు సాధించాడు. అనంతరం ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చి పాండ్యా కూడా మంచి ఆటతీరును కనబరిచాడు. రాహుల్‌తో కలిసి పరుగులు సాధించాడు. 29 బంతుల్లో 38 పరుగులు చేసి మురగన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రాహుల్‌తో కలిసి పాండే 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.
ఇక మ్యాచ్ చివరల్లో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 8 బంతుల్లో 15 పరుగులు సాధించి జయదేవ్ ఉనద్కత్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ముంబై జట్టులోని ప్రతీ బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జయదేవ్ ఉనద్కత్ 4 ఓవర్లకు గాను 32 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా, మురగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్ చేరో వికెట్ తీసుకున్నారు.
Credit Card: ఆ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. రూ.35 వేలు డిస్కౌంట్ పొందండిలా..!
IPL 2022: ఆ ప్లేయర్ ఐపీఎల్ ఆడకపోయినా 14 కోట్లు కచ్చితంగా చెల్లించాల్సిందే..!