IPL 2022: ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జనవరి మొదటి వారంలో నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం 2022 జనవరి మూడో వారందాకా మెగా వేలాన్ని నిర్వహించడం కుదరదంటూ వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గల కారణాలు కూడా నివేదికల్లో పేర్కొన్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడం వల్లే ఈ మెగా వేలం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.
అహ్మదాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యానికి సంబంధించిన అంశంపై కమిటీ నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదంటూ బీసీసీఐ అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం వచ్చే వరకు వేలం తేదీలను ఖరారు చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. దీని తర్వాత లక్నో, అహ్మదాబాద్ జట్లు కూడా ఐపీఎల్ వేలానికి ముందు చెరో 3 ఆటగాళ్లను కొనుగోలు చేసుకోవాల్సి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో జనవరి మూడు లేదా నాలుగో వారంలోపు వేలం నిర్వహించడం సాధ్యం కాదు. జనవరి మొదటి వారంలో వేలం నిర్వహిస్తామని గతంలో బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపింది.
రిటైన్ జాబితా విడుదల..
ఐపీఎల్‌లోని పాత ఎనిమిది జట్లు తమ అధీనంలో ఉన్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. దీంతో మిగతా ఆటగాళ్లందరూ వేలంలోకి ఎంటర్ అయ్యారు. లక్నో, అహ్మదాబాద్‌ల కొత్త జట్లు ప్రస్తుత వేలానికి ముందు చెరో ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం లక్నో జట్టు చూపు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ ఇషాన్ కిషన్‌పై ఉండగా, అహ్మదాబాద్ జట్టు శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్, హార్దిక్ పాండ్యాలను తమ జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.