దంబుల్లాలో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఇక్కడ భారత జట్టు 34 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయినా.. మ్యాచ్‌ను కాపాడుకుంది. అద్భుతంగా రాణిస్తున్న శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత క్రీడాకారిణి జెమీమా రోడ్రిగ్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
జెమీమా సూపర్ ఇన్నింగ్స్..
భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభం పేలవంగానే సాగింది. భారత్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (1), సబ్బినైని మేఘన (0) చౌకగా పెవిలియన్‌కు చేరుకున్నారు. అనంతరం ఓపెనర్ షఫాలీ వర్మ (31)కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) చక్కటి సహకారం అందించి జట్టు స్కోరును 50 దాటేలా చేశారు. దీని తర్వాత, జెమీమా రోడ్రిగ్జ్ 27 బంతుల్లో 36 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడుతూ భారత జట్టును నూట ముప్పై దాటించింది. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
.@JemiRodrigues bags the Player of the Match award for her solid batting effort. ?#TeamIndia begin the tour on a winning note as they beat Sri Lanka by 34 runs in the first #SLvIND T20I. ??
Scorecard ? https://t.co/XZabWPxI67 pic.twitter.com/XHKtCMc1mA
— BCCI Women (@BCCIWomen) June 23, 2022
కట్టుదిట్టమైన బౌలింగ్..
139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక టీంను భారత బౌలర్లు అడ్డుకున్నారు. ఆరంభం నుంచి శ్రీలంక జట్టును ఒత్తిడిలో ఉంచి నిర్ణీత విరామాల్లో వికెట్లు పడగొట్టారు. 54 పరుగులకే శ్రీలంక జట్టు 4 వికెట్లు కోల్పోయింది. కవిషా దిల్హరి 47 పరుగులతో అజేయంగా రాణించడంతో లంక జట్టు 100 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత ఓవర్లకు శ్రీలంక జట్టు 5 వికెట్ల నష్టానికి 104 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, షఫాలీ వర్మ తలో వికెట్ పడగొట్టారు.