Vaibhav Suryavanshi : వారు రియల్ వారియర్స్.. ఆ నలుగురు బ్యాట్స్‌మెన్‌ పై ప్రశంసల వర్షం కురిపించిన వైభవ్ సూర్యవంశీ

మాంచెస్టర్ టెస్ట్ డ్రా కావడంలో శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చూపిన అద్భుతమైన పోరాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బెన్ స్టోక్స్ ఆఫర్‌ను తిరస్కరించి సెంచరీలు బాదారు. వారి గురించి లేటెస్ట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఏమన్నారంటే...

Vaibhav Suryavanshi : వారు రియల్ వారియర్స్.. ఆ నలుగురు బ్యాట్స్‌మెన్‌ పై  ప్రశంసల వర్షం కురిపించిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi

Updated on: Jul 29, 2025 | 10:56 AM

Vaibhav Suryavanshi : క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన పోరాటాన్ని మాంచెస్టర్ టెస్ట్ చివరి రోజు భారత జట్టు ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల భారీ లోటుతో వెనుకబడిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో సున్నా పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో మ్యాచ్ భారత్ చేతి నుంచి జారిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. యువ బ్యాట్స్‌మెన్ శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్.. ఈ నలుగురూ కలిసి అద్భుతమైన, పోరాట పటిమతో కూడిన ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో భారత్ ఘోర పరాజయం నుంచి తప్పించుకోవడమే కాకుండా, ఈ టెస్టును చారిత్రాత్మక డ్రాగా మార్చింది. ఈ నలుగురు బ్యాట్స్‌మెన్‌లు రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 401 పరుగులు సాధించారు. మొత్తం 44 ఫోర్లు, సిక్సర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.

యంగ్ స్టార్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఈ నలుగురు భారత బ్యాట్స్‌మెన్‌లను వారియర్స్ అంటూ కొనియాడారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ నలుగురి ఫోటోలను షేర్ చేస్తూ, ఈ ప్లేయర్స్ రియల్ వారియర్స్ అని రాసుకొచ్చారు. ఇది భారత ఆటగాళ్ల అద్భుతమైన ఆటతీరుకు నిదర్శనం. నిజంగానే ఆ ఒత్తిడిలో వారు చూపిన ధైర్యం, నిలకడ ప్రశంసనీయం.

ఎవరు ఎంత రాణించారు?

ఈ చారిత్రాత్మక డ్రా వెనుక ఈ నలుగురి ప్రదర్శన చాలా కీలకం. వారి వ్యక్తిగత స్కోర్‌లు ఇవి:

శుభమన్ గిల్: 238 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 103 పరుగులు (సెంచరీ)

కేఎల్ రాహుల్: 230 బంతుల్లో 8 ఫోర్లతో 90 పరుగులు

రవీంద్ర జడేజా: 185 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో నాటౌట్ 107 పరుగులు (సెంచరీ)

వాషింగ్టన్ సుందర్: 206 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో నాటౌట్ 101 పరుగులు (సెంచరీ)

ఈ నలుగురు ఆటగాళ్ల అద్భుతమైన ఇన్నింగ్స్‌లు, ఎంత ఒత్తిడి ఉన్నా మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకునే పవర్ భారత బ్యాట్స్‌మెన్‌లకు ఉందని మరోసారి నిరూపించాయి. మ్యాచ్ చివరి గంటలో జరిగిన సంఘటనలు ఒక నాటకీయ మలుపును తలపించాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, భారత బ్యాట్స్‌మెన్‌లకు మ్యాచ్‌ను డ్రా చేసుకోవాలని ప్రతిపాదించాడు. కానీ, ఆ సమయంలో సెంచరీలకు దగ్గరగా ఉన్న రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (80) బెన్ స్టోక్స్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారు. మ్యాచ్ ఫలితం డ్రాగా ముగిసినప్పటికీ, వారిద్దరూ తమ బ్యాటింగ్ కొనసాగించి అద్భుతమైన సెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారత బ్యాట్స్‌మెన్‌ల ఈ నిర్ణయంతో స్టోక్స్ కాస్త అసంతృప్తిగా కనిపించినా, భారత క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది ఎంతో గర్వించదగిన క్షణంగా నిలిచింది. ఈ డ్రా కేవలం ఒక పాయింట్ మాత్రమే కాకుండా, భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..