
Indian Players International Debut Before IPL Debut: శ్రీలంకతో కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ కాలంగా నిలకడగా రాణిస్తున్న ఈ ఆఫ్ స్పిన్ బౌలర్‌కు 33 ఏళ్ల వయసులో టీమిండియా తుది జట్టులో అవకాశం దక్కింది. 21వ శతాబ్దంలో భారత్ తరఫున అత్యంత పెద్ద వయసులో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా సారాంశ్ చరిత్రకెక్కాడు. అయితే అంతకంటే విశేషమేమిటంటే, ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఈ ఆటగాడు నేరుగా దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన క్రికెటర్ల జాబితాలో నిలిచాడు. 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నెట్ బౌలర్‌గా సేవలందించిన అనుభవం తప్ప, అతనికి ఐపీఎల్ క్యాప్ అందలేదు.
భారత క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ కంటే ముందే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల సంఖ్య చాలా తక్కువ. 2008లో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌తో భారత జట్టులోకి వచ్చిన మురళీ విజయ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. గౌతమ్ గంభీర్ వివాదంతో ఒక మ్యాచ్ నిషేధానికి గురికావడంతో విజయ్‌కు ఆ అవకాశం వచ్చింది. ఆ తర్వాతి ఏడాదే అంటే 2009లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆయన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
ఆ తర్వాత భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సైతం ఇదే బాటలో ప్రయాణించాడు. 2013 జనవరి 6న పాకిస్థాన్‌తో దిల్లీలో జరిగిన వన్డే ద్వారా షమీ మొదట టీమిండియాలోకి వచ్చాడు. అదే ఏడాది నవంబర్ 6న కోల్‌కతాలో వెస్టిండీస్‌పై టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కొన్ని నెలల తర్వాతే, 2013 ఏప్రిల్ 8న కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆయన తన తొలి ఐపీఎల్ మ్యాచ్ బరిలోకి దిగాడు.
లీగ్ క్రికెట్ మెరుపులు లేకపోయినా సంప్రదాయ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చూపించిన నిలకడే సారాంశ్‌ను భారత జాతీయ జట్టులోకి నడిపించింది. ఇప్పటివరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 3.01 ఎకానమీతో ఏకంగా 188 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ కీలక సమయాల్లో రాణించాడు. 54 మ్యాచ్‌ల్లో 31.75 సగటు, 47.70 స్ట్రైక్ రేట్‌తో 2,223 పరుగులు సాధించి ఆల్‌రౌండర్‌గా తన విలువను చాటాడు.
సంప్రదాయ క్రికెట్‌లో రికార్డులు బాగుంటే ఎలాంటి లీగ్ నేపథ్యం లేకపోయినా టెస్టు జట్టులో చోటు దక్కుతుందని సారాంశ్ ప్రయాణం మరోసారి స్పష్టం చేస్తోంది. వయసుతో సంబంధం లేకుండా దేశవాళీలో కష్టపడితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని సారాంశ్ జైన్ నిరూపించాడు. ఐపీఎల్ మెరుపులకు దూరంగా ఉంటూనే రెడ్ బాల్ క్రికెట్ ద్వారా తన కలను సాకారం చేసుకున్న ఈ ఆటగాడి అరంగేట్రం ప్రతి దేశవాళీ క్రికెటర్‌కు స్ఫూర్తిదాయకం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..