Indian Cricket Team: సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మార్పు.. తగ్గేదేలే అంటోన్న టీమిండియా ఆల్‌ రౌండర్..

|

Mar 08, 2022 | 1:33 PM

Ravindra Jadeja: భారత్‌ తన బలమైన కోటలో ఆడిన గత 14 మ్యాచ్‌ల్లో ఎనిమిదో విజయం సాధించింది. జడేజా, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, కేవలం 228 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేశాడు.

Indian Cricket Team: సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మార్పు.. తగ్గేదేలే అంటోన్న టీమిండియా ఆల్‌ రౌండర్..
Indian Cricket Team Ravindra Jadeja
Follow us on

జడేజా చివరిసారిగా నవంబర్ 2021లో టీమిండియా (Indian Test Cricket) వైట్ జెర్సీని ధరించాడు. మొహాలీలో రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో అతని ఆటలో ఎటువంటి లోటు కనిపించలేదు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టును ఇన్నింగ్స్‌ తేడాతో విజయంవైపు నడిపించాడు. రవీంద్ర జడేజా(Ravindra Jadeja) లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాట్స్‌మెన్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం బ్యాటుతోనే కాదు, బౌలింగ్‌తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. జడేజా కారణంగా ఆతిథ్య భారత జట్టు(Team India) శ్రీలంకను ఇన్నింగ్స్ 222 పరుగులతో ఓడించింది. టీమిండియా తమ బలమైన కోటలో ఆడిన చివరి 14 మ్యాచ్‌లలో ఎనిమిదో విజయాన్ని సాధించింది. జడేజా, ఏడో స్థానంలో బరిలోకి దిగి, కేవలం 228 బంతుల్లో అజేయంగా 175 పరుగులు చేయడంతోపాటు తొమ్మిది వికెట్లు పడగొట్టి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.

ది ఓవల్‌తో మొదలైన దూకుడు..
సెప్టెంబరు 2018లో ది ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 160 పరుగులకు 6 వికట్లు కోల్పోయింది. ఈ టైంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా 156 బంతుల్లో అజేయంగా 86 పరుగులతో నిలిచాడు. దీంతో టీమిండియా స్కోరు 278కి చేర్చాడు. టెస్టు మ్యాచ్‌లో జట్టు ఓడిపోయినప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌లో లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

2018 నుంచి జడేజా 22 మ్యాచ్‌లలో (32 ఇన్నింగ్స్‌లు) 48.91 సగటుతో 1174 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ (55.06) తర్వాత భారత ఆటగాడు సాధించిన రెండో అత్యధిక సగటు జడేదే కావడం విశేషం. టాప్ 3 ప్రదర్శన పడిపోయిన సమయంలో లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జడేజా ప్రదర్శన కీలకంగా మారింది. సెప్టెంబర్ 2018 నుంచి ఛెతేశ్వర్ పుజారా సగటు 33.46, విరాట్ కోహ్లీ 40.61, అజింక్యా రహానే 34.3 గా నిలిచింది. అయితే 2021 నుంచి వీరంతా కలిపి కేవలం 26.23 సగటుతో ఉన్నారు. టాప్ 3 బ్యాట్స్‌మెన్స్ దారుణంగా పడిపోయన సమయంలో రోహిత్, రిషబ్ పంత్, జడేజాల కారణంగా భారత బ్యాటింగ్ బలహీనపడకుండా చూశారు.

ఈ కాలంలో జడేజా బ్యాటింగ్‌లో రెండు విషయాలు ప్రత్యేకంగా నిలిచాయి. జడేజా స్థిరమైన ప్రదర్శనతోపాటు జట్టు పరిస్థితి దారుణంగా పడిపోయినప్పుడు ఒత్తిడిలో పరుగులు సాధించగల సామర్థ్యం కలవాడిగా పేరుగాంచాడు. అతని కెరీర్‌లో రాజ్‌కోట్, మొహాలీలో రెండు సెంచరీలతో పాటు, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఈ కాలంలో తొమ్మిది అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అంటే అతను 32 ఇన్నింగ్స్‌లలో 11 సార్లు 50+ పరుగులు సాధించాడు. అలాగే స్థిరమైన ప్రదర్శనలో జడేజా రేషియే 2.91గా ఉంది. అలాగే రోహిత్ 3.2, మయాంక్ అగర్వాల్ 3.4, పుజారా 3.47, పంత్ 3.75, కోహ్లి 3.77, రహానే 4గా నిలిచింది. బ్యాట్స్‌మెన్‌గా జడేజా 25 శాతం మాత్రమే వైఫల్యం చెందాడు. లోయర్ ఆర్డర్‌లో జడేజా మెరుగ్గా రాణిస్తున్నాడనేందుకు ఈ గణాంకాలే రుజువుగా నిలిచాయనడంలో సందేహం లేదు.

జడేజా దాదాపు 70శాతం పరుగులు ఏడవ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థాయిలో బ్యాటింగ్‌ చేసినప్పుడు వచ్చాయి. ఇది అతని అత్యుత్తమ బ్యాటింగ్‌ను చూపించడంతోపాటు బెస్ట్ టెయిల్ ఎండర్‌గా నిరూపించనుంది. 2019లో SCGలో ఆస్ట్రేలియాపై 81 పరుగులు, 2020లో జరిగిన చారిత్రాత్మక MCG టెస్టులో రహానేతో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. నాటింగ్‌హామ్‌లో 145 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన సందర్భంలో జడేజా 58 పరుగులతో స్కోర్‌ను 189కి చేర్చాడు. వెస్టిండీస్‌ టీం దెబ్బకు టాప్ ఆర్డర్ చాలా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరగా, ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌లో జడేజా చేసిన మొత్తం పరుగులను కొలమానంగా తీస్తే.. ప్రపంచంలోని ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఇన్ని పరుగులు చేయకపోవడం విశేషం. ఆరవ, ఏడవ ఆర్డర్ నుంచి 500 పరుగులు చేసిన 17 మంది బ్యాట్స్‌మెన్‌లలో జడేజా బ్యాటింగ్ సగటు అత్యధికంగా (58.42) నిలిచింది.

మొహాలీలో రెండో రోజు ఆటలో జడేజా 175 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో బ్యాట్స్‌మెన్‌గాను మంచి పేరు తెచ్చిపెట్టింది. జడేజా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విధానం ఎంతో ప్రత్యేకమైనది. అతను పంత్‌ కంటే వేగంగా 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అశ్విన్‌తో రెండో సెంచరీ భాగస్వామ్యంలో తన స్కోరింగ్ రేట్‌ను 70కి పెంచుకున్నాడు. మహ్మద్ షమీతో కలిసి మూడో సెంచరీ భాగస్వామ్యంలో, జడేజా కేవలం 60 బంతుల్లో 118 స్ట్రైక్ రేట్‌తో 71 పరుగులు చేశాడు.

అశ్విన్ కంటే జడేజానే ముందంజ..

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రెండో రోజు బ్యాట్స్‌మెన్ జడేజాది అయితే, మూడో రోజు బౌలర్ జడేజాదిగా నిలిచింది. రెండో రోజు చివర్లో శ్రీలంక అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మెన్ దిముత్ కరుణరత్నేను పెవిలియన్ చేర్చాడు. జడేజా వేసిన బంతిని నిరోషన్ డిక్వెల్లా అర్థం చేసుకోలేకపోయాడు. స్వీప్ చేసే క్రమంలో బంతి బ్యాట్ ఔటర్ ఎడ్జ్ ను తాకగా, స్క్వేర్ లెగ్ వద్ద శ్రేయాస్ అయ్యర్ చేతికి చిక్కాడు. స్వీప్ షాట్‌ను ముందే ఊహించి లెగ్-సైడ్‌లో ఇద్దరు ఫీల్డర్‌లను ఉంచడంతో ఉచ్చులో చిక్కి పెవిలియన్ చేరాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్ సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార ఇదే రకంగా పెవిలియన్‌కు చేరుకున్నారు. శ్రీలంక జట్టు 161 పరుగులకు 4 వికెట్లు పడిపోయన స్థితి నుంచి 174 పరుగులకు ఆలౌటైంది. ఇక్కడ లంక టీం పాలిట జడేజా యముడిలా మారాడు. జడేజా బౌలింగ్ స్పెల్ 13 ఓవర్లలో 41 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. 49 ఏళ్లలో 150కి పైగా పరుగులు చేసి, 5 వికెట్లు పడగొట్టిన తొలి ఆల్ రౌండర్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా, అతను ఇలాంటి ఘనత సాధించిన మూడో భారతీయ ఆల్ రౌండర్ (వినూ మన్కడ్, పౌలి ఉమ్రిగర్), ప్రపంచ స్థాయిలో ఆరో ఆల్ రౌండర్‌గా మారాడు.

ఒకేరోజులో శ్రీలంకను రెండుసార్లు మడపెట్టిన భారత్..

మూడవ రోజు శ్రీలంక16 వికెట్లు కోల్పోయింది. అందులో జడేజా సగం అంటే 8 వికెట్లు సాధించాడు. దీంతో జడేజా అత్యంత ప్రభావవంతమైన ఆల్ రౌండర్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. సెంచరీ చేయడంతోపాటు ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం భారత క్రికెట్ చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. జడేజా కేవలం ఒక వికెట్ తేడాతో 10 వికెట్లు తీసిన రికార్డును కోల్పోయాడు.

జడేజా భారత్‌లో 35 టెస్టుల్లో 54.7 స్ట్రైక్ రేట్‌తో 171 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఎనిమిది అర్ధ సెంచరీలు, 10 వికెట్లు ఉన్నాయి. భారత్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 12 మంది బౌలర్లలో అతని బౌలింగ్ సగటు 20.41గా నిలిచింది. ఈ సగటు అశ్విన్ కంటే ఎక్కువగా ఉండడం విశేషం. భారత్‌లో గెలిచిన మ్యాచ్‌లలో జడేజా బౌలింగ్ సగటు 18.99గా నిలిచింది. అశ్విన్ 18.1 కంటే కొంచెం మెరుగ్గా ఉంది.

భారత్‌లో జడేజా ఆడిన 35 మ్యాచ్‌ల్లో అశ్విన్ 50.2 స్ట్రైక్ రేట్‌తో 203 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ బౌలర్ జడేజా 54.7 బంతుల్లో 171 వికెట్లు పడగొట్టాడు. అయితే, జడేజా ఈ మ్యాచ్‌లలో అశ్విన్ కంటే మెరుగైన బౌలింగ్ సగటు (20.41 vs 21.97) కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో అతను బ్యాట్స్‌మెన్‌లను ఎక్కువగా నియంత్రించగలడని సూచిస్తుంది.

జడేజా ఎకానమీ రేటు 2.23గా ఉంది. కాగా, అశ్విన్ ఎకానమీ రేటు 2.62గా నిలిచింది. ఇద్దరి ఎకానమీ రేట్లను పోల్చితే అశ్విన్ కంటే తక్కువగా ఉంది. ఇది అతని లైన్ అండ్ లెన్త్ ప్రదర్శనకు నిదర్శనంగా నిలిచింది. డిసెంబర్ 2012లో టెస్ట్ క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుంచి జడేజా (2.42) కంటే మెరుగైన ఎకానమీ రేట్‌ను ఏ బౌలర్ కలిగి లేకపోవడం విశేషం.

2018 నుంచి జడేజా బ్యాటింగ్, బౌలింగ్ సగటు వ్యత్యాసం 21.77గా నిలిచింది. జడేజా తర్వాత జాసన్ హోల్డర్ (8.08), బెన్ స్టోక్స్ (7.92) ఉన్నారు. మొత్తంమీద, టెస్ట్ కెరీర్‌లో జడేజా బ్యాటింగ్, బౌలింగ్ తేడా 12.17గా నిలిచింది. కనీసం 2000 పరుగులు, 100 వికెట్లు తీసిన 32 అత్యుత్తమ ఆల్ రౌండర్లలో జడేజా ఐదవ స్థానంలో నిలిచాడు. జడేజా కంటే గ్యారీ సోబర్స్ (23.74), జాక్వెస్ కల్లిస్ (22.71), ఇమ్రాన్ ఖాన్ (14.88), కీత్ మిల్లర్ (13.99)లాంటి దిగ్గజాలు ఉన్నారు. కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, రిచర్డ్ హ్యాడ్లీ, షాన్ పొలాక్, ట్రెవర్ గొడ్దార్డ్, టోనీ గ్రేగ్, షకీబ్ అల్ హసన్, క్రిస్ కెయిర్న్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, బెన్ స్టోక్స్ వంటి గొప్ప ఆల్ రౌండర్ల కంటే జడేజా మెరుగ్గా ఉన్నాడని ఈ గణాంకాలు బట్టి చూస్తే అర్థమవుతుంది.

ఆటగాడి ప్రభావాన్ని అంచనా వేయడానికి అనేక ఇతర ప్రమాణాలు ఉన్నాయి. అయితే, జడేజా మాత్రం అన్ని కాలాలలోనూ అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచాడనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే జడేజా తనను తాను సాధారణ ఆటగాడి నుంచి ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా మార్చుకుని, ప్రశంసలు అందుకుంటున్నాడు.

– నిఖిల్ నారాయణ్

Also Read: ICC Women World Cup 2022: 25 ఏళ్లనాటి రికార్డు బద్దలు.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జోడీ..

Watch Video: మైదానంలో పొట్టుపొట్టు తిట్టుకున్న షేన్ వార్న్, వెస్టిండీస్ ప్లేయర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఆనాటి వీడియో..