
Smriti Mandhana World Record: భారత మహిళా క్రికెట్ సంచలనం స్మృతి మంధాన తన కెరీర్‌లో మరో అపురూపమైన మైలురాయిని చేరుకుంది. ఆదివారం శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆమె కేవలం ఒకే ఇన్నింగ్స్‌తో అనేక రికార్డులను తిరగరాసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడమే కాకుండా, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా దిగ్గజ ప్లేయర్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది.
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ స్మృతి మంధాన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. శ్రీలంక బౌలర్లను ఆడుకుంటూ ఆమె చేసిన విధ్వంసం భారత జట్టుకు భారీ విజయాన్ని అందించడమే కాకుండా, వ్యక్తిగత రికార్డుల పంట పండించింది.
ఈ మ్యాచ్‌కు ముందు స్మృతి మంధాన 10,000 పరుగుల మైలురాయికి కేవలం 27 పరుగుల దూరంలో ఉంది. ఇన్నింగ్స్ 7వ ఓవర్లో సింగిల్ తీయడం ద్వారా ఆమె ఈ అరుదైన ఘనతను అందుకుంది. కేవలం 281 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరుకోవడం ద్వారా.. గతంలో మిథాలీ రాజ్ (291 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉన్న రికార్డును స్మృతి అధిగమించింది.
అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ క్రీడాకారిణిగా, ప్రపంచవ్యాప్తంగా నాలుగో ప్లేయర్‌గా (మిథాలీ రాజ్, సుజీ బేట్స్, షార్లెట్ ఎడ్వర్డ్స్ తర్వాత) స్మృతి రికార్డు సృష్టించింది.
కేవలం వ్యక్తిగత రికార్డులే కాకుండా, షఫాలీ వర్మతో కలిసి స్మృతి మంధాన మొదటి వికెట్‌కు 162 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మహిళల టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్ తరపున ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. స్మృతి 48 బంతుల్లో 80 పరుగులు (11 ఫోర్లు, 3 సిక్సర్లు) చేయగా, షఫాలీ 79 పరుగులు చేసింది.
స్మృతి మంధాన ఫామ్ చూస్తుంటే మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (10,868) ఆల్‌టైమ్ రికార్డును కూడా ఆమె త్వరలోనే అధిగమించేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ విజయంతో భారత్ శ్రీలంకపై 4-0తో సిరీస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..