IND vs WI: సెయింట్‌ కిట్స్‌లో సూర్య ప్రతాపం.. మూడోటీ20లో భారత్‌ ఘనవిజయం

|

Aug 03, 2022 | 7:28 AM

India vs West Indies: రెండో టీ20 మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. సెయింట్‌ కిట్స్‌ లోని బస్సెటెర్రె మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి..

IND vs WI: సెయింట్‌ కిట్స్‌లో సూర్య ప్రతాపం.. మూడోటీ20లో భారత్‌ ఘనవిజయం
Suryakumar Yadav
Follow us on

India vs West Indies: రెండో టీ20 మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. సెయింట్‌ కిట్స్‌ లోని బస్సెటెర్రె మైదానంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కరేబియన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ జట్టు మరో 6 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. కెప్టెన్‌ రోహిత్ శర్మ(11; ఫోర్‌, సిక్స్‌) కొన్ని మెరుపులు మెరిపించినప్పటికీ రెండో ఓవర్‌లోనే రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే మొదటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 76; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఈసారి తన ప్రతాపం చూపించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 24; రెండు ఫోర్లు)తో కలిసి మంచి శుభారంభం అందించాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (4) నిరాశపరిచినా.. దీపక్‌ హుడా (10 నాటౌట్‌; 7 బంతుల్లో)తో కలిసి రిషబ్‌ పంత్‌ (33 నాటౌట్‌; 24 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌) వేగంగా రన్స్‌ చేయడంతో టీమిండియా ఖాతాలో మరో విజయం చేరింది. కీలక ఇన్నింగ్స్‌తో భారత్‌ జట్టుకు విజయం అందించిన సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ పురస్కారం లభించింది.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్‌ మేయర్స్‌ ( 53 బంతుల్లో 73, 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), బ్రాండన్‌ కింగ్‌ ( 20 బంతుల్లో 20, 3 ఫోర్లు) మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ ( 23 బంతుల్లో్ 22 ), రోవ్‌మాన్‌ పావెల్‌ (14 బంతుల్లో 23), హెట్‌మెయిర్‌ ( 12 బంతుల్లో 20) తలా ఓ చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ (35/2), హార్దిక్‌ పాండ్యా (19/1), అర్ష్‌దీప్‌ సింగ్‌ (26/1) సత్తాటాచారు. వికెట్లు తీయకపోయినా అశ్విన్‌ (26/0) పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఇక ఇరుజట్ల మధ్య నాలుగోటీ 20 మ్యాచ్‌ శనివారం (ఆగస్టు6) జరగనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..