WCL 2025 : డబ్బులు కాదు.. ప్రజల మనోభావాలే ముఖ్యం..మ్యాచ్ రద్దుపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకుల సంచలన ప్రకటన

క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ రద్దుపై వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని త్యజించి, ప్రజల మనోభావాలకే పెద్ద పీట వేసినట్లు ప్రకటించారు. భారత్ జట్టు వైదొలగడంతో పాకిస్తాన్‌ను నేరుగా ఫైనల్‌కు పంపిన ఈ నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది.

WCL 2025 : డబ్బులు కాదు.. ప్రజల మనోభావాలే  ముఖ్యం..మ్యాచ్ రద్దుపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకుల సంచలన ప్రకటన
Wcl 2025

Updated on: Jul 31, 2025 | 11:16 AM

WCL 2025 : క్రికెట్ అభిమానులకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక పండగ. అలాంటిది, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను రద్దు చేశారు. భారత్ ఛాంపియన్స్ జట్టు ఆడటానికి నిరాకరించడంతో పాకిస్తాన్ ఛాంపియన్స్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. బర్మింగ్‌హామ్‌లో గురువారం జరగాల్సిన ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య సెమీ-ఫైనల్ మ్యాచ్ రద్దయింది. టీమ్ ఇండియా ఈ మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ఉదయం, ఇండియన్ స్పాన్సర్ ఈజ్‌మైట్రిప్ సంస్థ ఈ మ్యాచ్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాద ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ‘ఉగ్రవాదం, క్రికెట్ కలిసి సాగలేవు’ అని కంపెనీ వ్యవస్థాపకుడు స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాతే మ్యాచ్ రద్దు గురించి పెద్ద చర్చ మొదలైంది.

డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇండియా తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. పాకిస్తాన్ జట్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మ్యాచ్‌ను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. క్రీడలు స్ఫూర్తినిస్తాయి, సానుకూల మార్పును తీసుకొస్తాయని మేము నమ్ముతాం. అయితే, ప్రజల మనోభావాలకు ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే, మేము చేసే ప్రతి పని మా ప్రేక్షకుల కోసమే. సెమీ ఫైనల్స్ నుండి వైదొలగాలనే ఇండియా ఛాంపియన్స్ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము, అలాగే పోటీ పడటానికి పాకిస్తాన్ ఛాంపియన్స్ సంసిద్ధతను కూడా గౌరవిస్తున్నాము. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్‌ను రద్దు చేశాము. ఫలితంగా, పాకిస్తాన్ ఛాంపియన్స్ ఫైనల్‌కు వెళ్తుంది” అని ఆ ప్రకటనలో వివరించారు.

డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్‌తో ఆడటానికి భారత్ నిరాకరించడానికి ప్రధాన కారణం రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాలే. ముఖ్యంగా పహల్గామ్ ఘటన దీనికి దారితీసిందని తెలుస్తోంది. ఇది కొత్తేమీ కాదు. జులై 20న గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సమయంలో కూడా యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప వంటి ఆటగాళ్లు ఉన్న ఇండియా ఛాంపియన్స్ జట్టు, పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టుతో తమ గ్రూప్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించింది. అప్పుడే ఈ వివాదం మొదలైంది. భారత్ టోర్నమెంట్ నుండి వైదొలగడంతో, పాకిస్తాన్ ఛాంపియన్స్ ఫైనల్‌కు చేరుకుంది. వారు ఇప్పుడు ఆస్ట్రేలియా ఛాంపియన్స్, సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ మధ్య జరిగే రెండో సెమీ-ఫైనల్ విజేతతో తలపడతారు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..