
U19 World Cup 2026 : అండర్-19 వరల్డ్ కప్ సూపర్-6 దశలో భారత్ తన తొలి మ్యాచ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, మొత్తంగా 52 పరుగులు (30 బంతులు, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే (21) మరోసారి బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, మధ్యలో వచ్చిన విహాన్ మల్హోత్రా అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 107 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విహాన్, ఈ టోర్నీలో తన సత్తా ఏంటో నిరూపించాడు. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు (61) కూడా కీలకమైన హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ భారీ స్కోరును నమోదు చేయగలిగింది.
353 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆరంభం నుండే చుక్కలు చూపించారు. ఆర్‌ఎస్ అంబరీష్, హెనిల్ పటేల్ తమ పదునైన బంతులతో ఓపెనర్లను పెవిలియన్‌కు పంపారు. అయితే, జింబాబ్వే బ్యాటర్లు లీరోయ్ చివాలా (62), కియాన్ బ్లిగ్నాట్ (37) కొద్దిసేపు ప్రతిఘటించడంతో ఒక దశలో స్కోరు 4 వికెట్లకు 142 పరుగులుగా ఉంది. కానీ, ఆ తర్వాత అసలైన వినోదం మొదలైంది. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, ఉద్ధవ్ మోహన్ బంతిని అందుకున్న తర్వాత జింబాబ్వే బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది.
భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే చివరి 6 వికెట్లను కేవలం 6 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. 142/4 నుంచి 148 పరుగులకు ఆలౌట్ కావడం భారత బౌలింగ్ పటిమకు నిదర్శనం. కెప్టెన్ ఆయుష్ కేవలం 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఉద్ధవ్ మోహన్ కూడా 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోకుండా చేశారు. దీంతో జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకు కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ సూపర్-6 గ్రూప్-2లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత తదుపరి మ్యాచ్ ఫిబ్రవరి 1న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనుంది, ఇది సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..