
IND vs SL : భారత క్రికెట్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. టీమిండియా సుదీర్ఘ విరామం తర్వాత పొరుగు దేశమైన శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత భారత జట్టు లంక గడ్డపై వైట్ జెర్సీతో బరిలోకి దిగబోతుండటం విశేషం. చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు శ్రీలంకలో టెస్ట్ సిరీస్ ఆడింది. అప్పట్లో లంకను వారి సొంత గడ్డపైనే క్లీన్ స్వీప్ చేసి కోహ్లీ సేన చరిత్ర సృష్టించింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత టీమిండియా అక్కడ అడుగుపెడుతుండటంతో ఈ టూర్ ఫుల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున మొదటి టెస్ట్ ప్రారంభం
ప్రముఖ క్రీడా వెబ్‌సైట్ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. భారత్, శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆగస్టు 15న ఘనంగా ప్రారంభం కానుంది. సరిగ్గా భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గాల్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు జరుగుతుంది. ఆ తర్వాత కొద్దిరోజుల గ్యాప్‌తో ఆగస్టు 23 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ రెండో మ్యాచ్ జరగబోయే వేదికపై లంక బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సెంట్రల్ కొలంబోలోని ప్రసిద్ధ సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC) మైదానంలో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో కీలకంగా మారనున్న సిరీస్
శ్రీలంకతో జరగబోయే ఈ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కేవలం ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే కాదు. ఇది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భాగంగా జరగబోతోంది. కాబట్టి ఫైనల్ రేసులో నిలవాలంటే రెండు జట్లకూ ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) కానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కానీ ఈ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కానీ అంతర్గత సమాచారం ప్రకారం ఈ తేదీలు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఈ సిరీస్ ఆడబోతుండటం గమనార్హం.
టెస్టులతో పాటు టీ20ల ధమాకా కూడా
ఈ పర్యటనలో కేవలం టెస్ట్ మ్యాచ్‌లు మాత్రమే కాకుండా, అభిమానులను అలరించడానికి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా కూడా హింట్ ఇచ్చారు. లంక బోర్డు నుంచి అదనంగా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సిందిగా తమకు అభ్యర్థన వచ్చిందని ఆయన మీడియాకు వెల్లడించారు. దీనిపై బీసీసీఐ సానుకూలంగానే ఉందని, త్వరలోనే మ్యాచ్‌ల తేదీలు, వేదికలతో కూడిన పూర్తి అధికారిక షెడ్యూల్‌ను ఇరు దేశాల బోర్డులు సంయుక్తంగా విడుదల చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..