IND vs SA : 9 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. రెండో టీ20 లో ఘోర ఓటమితో చెత్త రికార్డు

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 51 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది.

IND vs SA : 9 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. రెండో టీ20 లో ఘోర ఓటమితో చెత్త రికార్డు
Team India

Updated on: Dec 12, 2025 | 2:20 PM

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రెండవ మ్యాచ్ న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 51 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలనే భారత్ నిర్ణయం తప్పని రుజువైంది. ఎందుకంటే మొదట బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోగా ఆపై బ్యాటర్లు కూడా ఘోరంగా విఫలమయ్యారు. 200+ పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో అగ్రశ్రేణి బ్యాటర్లు అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ నుంచి ఆశించిన ఆట రాలేదు.

సౌతాఫ్రికా నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో తిలక్ వర్మ, జితేశ్ శర్మ క్రీజులో ఉన్నారు. ఆ సమయానికి భారత్ స్కోరు 142 వద్ద ఉండగా, ఓటమి దాదాపు ఖాయమైనప్పటికీ కనీసం బ్యాటర్లు చివరి ఓవర్ వరకు పోరాడి స్కోరును లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తారని ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది. 18వ ఓవర్‌ 5వ బంతికి జితేశ్ ఔటయ్యాడు. ఆ తర్వాత టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 19వ ఓవర్‌లో శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేరారు. చివరి ఓవర్‌ మొదటి బంతికి తిలక్ వర్మ వికెట్ కోల్పోవడంతో భారత్ ఇన్నింగ్స్ 162 పరుగులకే ముగిసింది. ఆఖరి 5 వికెట్లు పడే క్రమంలో భారత్ కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగిం. ఇది కేవలం 9 బంతుల్లో జరిగిపోయింది.

సౌతాఫ్రికాతో జరిగిన ఈ రెండవ మ్యాచ్‌లో, టీమిండియా బ్యాట్స్‌మెన్ అందరూ ఫాస్ట్ బౌలర్లకే వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో భారత్ ఖాతాలో ఒక అవమానకరమైన రికార్డు నమోదైంది. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అందరూ కేవలం ఫాస్ట్ బౌలర్లకే ఔట్ కావడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి. అదేవిధంగా సౌతాఫ్రికా విషయంలో కూడా ఒక టీ20 మ్యాచ్‌లో వారి ఫాస్ట్ బౌలర్లు 10 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి.

టీమిండియా పై T20 ఇంటర్నేషనల్స్‌లో 13వ విజయాన్ని సాధించిన సౌతాఫ్రికా, ఈ ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు భారత్‌పై చెరి 12 విజయాలు సాధించాయి. ప్రస్తుతం న్యూజిలాండ్, వెస్టిండీస్‌లు భారత్‌పై టీ20 ఫార్మాట్‌లో చెరి 10 మ్యాచ్‌లు గెలిచాయి. సౌతాఫ్రికా ఈ విజయంతో వారిని అధిగమించింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..