గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

2027 world cup: అఫ్గానిస్తాన్ వన్డే సిరీస్ విజయం భారత జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అనుభవంతో పాటు ఇషాన్ కిషన్, గుర్నూర్ బ్రార్ వంటి యువ రక్తం తోడవ్వడం భారత జట్టు సమతుల్యతను పెంచింది. రాబోయే రోజుల్లో వీరు ఇదే ఫామ్ కొనసాగిస్తే మిషన్ 2027 ప్రపంచకప్‌లో భారత్‌కు తిరుగుండదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?
2027 World Cup Team India

Updated on: Jun 22, 2026 | 7:30 AM

2027 World Cup: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన వన్డే సిరీస్ ముగింపుతో రాబోయే ప్రపంచకప్‌నకు సన్నాహాలు మరింత ఊపందుకున్నాయి. ఈ సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, కొందరు ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానాన్ని సంపాదించుకోవడానికి ముందడుగు వేశారు.

చేపాక్‌లో క్లీన్ స్వీప్.. ప్రపంచకప్‌నకు పక్కా ప్రణాళికలు..

అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. చెన్నైలోని చేపాక్ మైదానంలో జరిగిన ఆఖరి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. మరో ఏడాదిలో ప్రపంచకప్ రాబోతుండటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జట్టులోని వివిధ స్థానాల కోసం కొత్త కాంబినేషన్లను పరీక్షిస్తోంది. ఈ తీవ్రమైన పోటీ మధ్య, అఫ్గాన్ సిరీస్‌లో అదరగొట్టిన ముగ్గురు ఆటగాళ్లు తమ ప్రపంచకప్ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ముగ్గురు వీరులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. కొత్త బౌలింగ్ సంచలనం – గుర్నూర్ బ్రార్..

ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన పంజాబ్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్ తన వేగం, క్రమశిక్షణతో అందరినీ ఆకట్టుకున్నాడు. మొదటి వన్డేలోనే కేవలం 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన గుర్నూర్, రెండో మ్యాచ్‌లోనూ 60 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 5.96 ఎకానమీతో మొత్తం 7 వికెట్లు తీసి సిరీస్‌ను విజయవంతంగా ముగించాడు.

ఈ అద్భుత ప్రదర్శనకు ప్రతిఫలంగా అతనికి ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జట్టులోనూ చోటు దక్కింది. 6 అడుగుల 5 అంగుళాల పొడవు, కొత్త బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న గుర్నూర్, రాబోయే 2027 ప్రపంచకప్ జట్టులో పేస్ విభాగానికి ప్రధాన బలంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

2. విమర్శకుల నోళ్లు మూయించిన ఇషాన్ కిషన్..

దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డే జట్టులోకి పునరాగమనం చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్ ఇషాన్ కిషన్, ఈ సిరీస్‌లో తనను తాను నిరూపించుకోవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. సంజు శాంసన్, రిషబ్ పంత్ వంటి బలమైన పోటీదారులు ఉన్నప్పటికీ దక్కిన అవకాశాన్ని ఇషాన్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.

మొదటి వన్డేలో 22 బంతుల్లో 34 పరుగులు చేసిన ఇషాన్, రెండో వన్డేలో కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులతో తన కెరీర్‌లో రెండో వన్డే సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా వన్డేల్లో 1,000 పరుగుల మైలురాయిని కూడా దాటాడు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో 317 పరుగులతో అదరగొట్టిన ఇషాన్, అదే ఫామ్‌ను ఇక్కడా కొనసాగించి 2027 ప్రపంచకప్ రేసులో అందరికంటే ముందు నిలిచాడు.

3. తగ్గేదే లే అంటున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ..

వచ్చే ఏడాది 40వ పడిలోకి అడుగుపెట్టనున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై కొన్ని సందేహాలు వ్యక్తమైనప్పటికీ, అతను తన బ్యాట్‌తోనే వాటికి సమాధానం ఇచ్చాడు. ప్రపంచకప్ ఆడాలనే పట్టుదలతో ఉన్న రోహిత్, తన ఫిట్‌నెస్, ఆట తీరుతో జట్టుకు దిక్సూచిగా నిలుస్తున్నాడు.

తొలి రెండు వన్డేల్లో 16, 48 పరుగులు చేసిన రోహిత్, చెన్నైలో జరిగిన ఆఖరి వన్డేలో 79 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి మొదటి వికెట్‌కు 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వన్డేల్లో 277 ఇన్నింగ్స్‌లలో 11,720 పరుగుల అపార అనుభవం ఉన్న రోహిత్ శర్మ, ఓపెనర్‌గా 2027 ప్రపంచకప్‌నకు వెళ్లడం దాదాపు ఖాయంగా మారిపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us