IND vs PAK: భారత క్రికెటర్లకు నిజంగా దేశభక్తి ఉంటే ఆ పని చేయాలి? దమ్ముంటే చేసి చూపించాలి! పాక్‌ క్రికెటర్‌ సవాల్‌

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ట్, భారత మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ రద్దు చేసిన విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశభక్తి ఉంటే భారత్ పాకిస్థాన్ తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకూడదని డిమాండ్ చేశారు.

IND vs PAK: భారత క్రికెటర్లకు నిజంగా దేశభక్తి ఉంటే ఆ పని చేయాలి? దమ్ముంటే చేసి చూపించాలి! పాక్‌ క్రికెటర్‌ సవాల్‌
Ind Vs Pak

Updated on: Jul 22, 2025 | 12:09 PM

భారత క్రికెటర్లకు నిజంగానే దేశభక్తి ఉంటే ఇకపై పాకిస్థాన్‌తో ఏ స్థాయిలో కూడా క్రికెట్‌ ఆడొద్దని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్ భట్‌ ఘాటు విమర్శలు చేశాడు. ఒక్క క్రికెట్‌ అనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్‌ వేదికగా కూడా పాకిస్థాన్‌తో ఏ స్పోర్ట్‌లోనూ పోటీ పడొద్దని, అలా చేయగలారా? అంటూ సవాల్‌ విసిరాడు. సల్మాన్‌ భట్‌ ఏడుపునకు కారణం ఏంటంటే.. గత ఆదివారం (జులై 20) వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌లో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత క్రికెటర్లు రద్దు చేసుకున్నారు. ఈ డబ్లూసీఎల్‌ టోర్నీలో ఇరు దేశాల రిటైర్డ్‌ క్రికెటర్లు మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. యువరాజ్‌ కెప్టెన్సీలో భారత మాజీ క్రికెటర్ల జట్టు, షాహిద్‌ అఫ్రిదీ కెప్టె్న్సీలో పాక్‌ మాజీ క్రికెటర్ల టీమ్‌ తలపడాల్సి ఉండగా మ్యాచ్‌ రద్దు అయింది.

పహల్గామ్‌ ఉగ్రదాడికి నిరసనగా భారత మాజీ క్రికెటర్లు పాక్‌తో మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయించుకున్నారు. ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. చివరి నిమిషంలో మ్యాచ్‌ రద్దుతో క్రికెట్‌ ప్రపంచం దీని గురించి మాట్లాడుకుంది. ఇదే విషయంపై సల్మాన్‌ భట్‌ స్పందిస్తూ.. ఇకపై టీమిండియా, పాకిస్థాన్‌తో వరల్డ్‌ కప్‌, ఒలింపిక్స్‌లో కూడా తలపడదని వాళ్లు ప్రామిస్‌ చేయాలంటూ తన ఆక్రోషం వెళ్లగక్కాడు. క్రికెట్‌ విషయానికి వచ్చే సరికే ఇండియా, పాకిస్థాన్‌ మధ్య సంబంధాల మధ్య చర్చ జరుగుతుందని, ఇతర ఆటల్లో మాత్రం అలాంటి ఇబ్బంది ఉండదని అన్నాడు. ఇప్పుడు చేసినట్లే.. వరల్డ్‌ కప్‌, ఒలింపిక్స్‌లో కూడా భారత జట్టు పాకిస్థాన్‌తో ఆడమని చెప్పాలని, అప్పుడు వాళ్ల దేశభక్తి ఏ పాటిదో తాను కూడా చూస్తానంటూ పెద్ద పెద్ద మాటలే మాట్లాడాడు. కాగా ఇండియాతో క్రికెట్‌ ఆడాలని పాకిస్థాన్‌ క్రికెటర్ల ఎంతో ఆసక్తిగా ఉంటారు.

ఎందుకంటే పేద దేశమైన పాకిస్థాన్‌కు టీమిండియాతో మ్యాచ్‌లు ఆడి ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు అని చూస్తుంటారు. ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాతో మ్యాచ్‌ అనగానే వాళ్లకు స్పాన్సర్లు, యాడ్‌ రెవెన్యూ, బ్రాడ్‌ కాస్టింగ్‌ నుంచి మంచిగా డబ్బు వస్తుంది. దాని కోసమే ఇండియాతో మ్యాచ్‌ల కోసం పాకులాడుతూ ఉంటారు. ఇప్పుడు సల్మాన్ భట్‌ ఏడుపు కూడా అందుకే. కాగా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ రద్దు చేయడంపై భారత మాజీ క్రికెటర్లపై భారత క్రికెట్‌ అభిమానులు ప్రశంసల వర్షం కురిపించారు. నిజానికి.. ఈ టోర్నీలో భారత్‌, పాక్‌ తలపడుతున్నాయని తెలియగానే.. తీవ్ర విమర్శలు వచ్చాయి. మొత్తానికి భారత క్రికెట్‌ అభిమానుల నుంచి వచ్చి ఒత్తిడి, విమర్శల కారణంగానే మ్యాచ్‌ రద్దు అయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి