WCL 2025 : డబ్ల్యూసీఎల్ 2025లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. పాయింట్ల కోసం పాకిస్థాన్ కొత్త డిమాండ్

WCL 2025 లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు కావడంతో, పాకిస్థాన్ జట్టు పూర్తి 2 పాయింట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. పహల్గామ్ దాడి తర్వాత భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి తప్పుకోవడమే దీనికి కారణం. ఈ వివాదం టోర్నమెంట్‌లో కొత్త చిక్కులు సృష్టిస్తోంది.

WCL 2025 : డబ్ల్యూసీఎల్ 2025లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. పాయింట్ల కోసం పాకిస్థాన్ కొత్త డిమాండ్
Wcl 2025

Updated on: Jul 22, 2025 | 11:21 AM

WCL 2025 : వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో జరగాల్సిన నాల్గవ మ్యాచ్ రద్దు కావడంతో పెద్ద వివాదం మొదలైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సిన ఈ మ్యాచ్ రద్దు కావడంతో, పాకిస్థాన్ జట్టు పాయింట్ల కోసం కొత్త డిమాండ్ పెట్టింది. సాధారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. కానీ ఈ మ్యాచ్ రద్దు కావడానికి భారత ఆటగాళ్లే కారణం కాబట్టి, తమకు పూర్తి 2 పాయింట్లు ఇవ్వాలని పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు యజమాని కామిల్ ఖాన్ డిమాండ్ చేశారు. “మేము ఆడటానికి రెడీగా ఉన్నాం. భారత జట్టు మ్యాచ్ ఆడటానికి నిరాకరించింది. కాబట్టి, మాకు పూర్తి పాయింట్లు ఇవ్వాలి” అని కామిల్ ఖాన్ పేర్కొన్నారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు కాలేదని, భారత ఆటగాళ్లు తప్పుకోవడం వల్లే జరిగిందని ఆయన వాదించారు.

ఈ డిమాండ్ ఇప్పుడు డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు కొత్త తలనొప్పిగా మారింది. ఎందుకంటే, వారు ఇప్పటికే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ, పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు పాయింట్లను పంచుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఇండియా ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య మ్యాచ్ జూలై 20న జరగాల్సి ఉంది. ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ఆదివారం ఉదయం రద్దు అయింది. దీనికి ప్రధాన కారణం భారత ఆటగాళ్లు మ్యాచ్ నుంచి తప్పుకోవడం. ఏప్రిల్ 22న జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి ఈ నిర్ణయానికి దారితీసింది.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ, పాకిస్థాన్‌తో భారత ఆటగాళ్లు ఏ మ్యాచ్ ఆడకూడదని సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యూసుఫ్ పఠాన్, సురేష్ రైనా, శిఖర్ ధావన్ వంటి ప్లేయర్లు పాకిస్థాన్‌తో ఆడబోమని ప్రకటించారు. దీంతో ఇండియా ఛాంపియన్స్ జట్టులోని ఇతర ఆటగాళ్లు కూడా తప్పుకునే అవకాశం ఉండటంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..