
IND vs AUS : దేశంలో దీపావళి పండుగ సన్నాహాలు జరుగుతున్నాయి. టీమిండియా మొదటి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించి దేశ ప్రజలకు గెలుపు కానుక అందిస్తుందని అభిమానులు ఆశించారు, కానీ అది సాధ్యం కాలేదు. పెర్త్ లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ మిచెల్ మార్ష్ అజేయంగా 46 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 26 ఓవర్లకు కుదించారు. ఈ మైదానంలో ఆస్ట్రేలియాకు ఇది మొదటి గెలుపు.
మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వర్షం కూడా టీమిండియాకు శత్రువుగానే మారింది. వర్షం కారణంగా మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 26 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే, డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యం లభించింది. కంగారూలు ఈ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 21.1 ఓవర్లలోనే సాధించారు. 223 రోజుల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున ఆడేందుకు బరిలోకి దిగారు.. కానీ ఈ దిగ్గజాల కంబ్యాక్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించలేకపోయింది. వారిద్దరి బ్యాట్ కూడా నిశబ్ధంగా ఉంది.
ఈ ఏడాది (2025లో) వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇది మొదటి ఓటమి. దీంతో భారత్ విజయాల పరంపరకు కూడా బ్రేక్ పడింది. వరుసగా 8 విజయాల తర్వాత టీమిండియా ఒక వన్డే మ్యాచ్‌లో ఓటమి పాలైంది. బ్యాట్స్‌మెన్‌లు విఫలమైన తర్వాత, భారత బౌలర్లు కూడా ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కంగారూ బౌలర్లు అద్భుతంగా రాణించినట్లుగా, భారత బౌలర్లు బౌలింగ్ చేయలేకపోయారు.
131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభం అంతగా కలిసి రాలేదు. ట్రావిస్ హెడ్ ఐదు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టిన తర్వాత అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మాథ్యూ షార్ట్ కూడా తక్కువ పరుగులకే (8 రన్స్) పెవిలియన్‌కు తిరిగి వెళ్ళాడు. అయితే, మరోవైపు కెప్టెన్ మిచెల్ మార్ష్ వేగంగా పరుగులు సాధిస్తూనే ఉన్నాడు.
మిచెల్ మార్ష్ 52 బంతుల్లో అజేయంగా 46 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. జోష్ ఫిలిప్ కూడా 29 బంతుల్లో 37 పరుగులు చేశాడు, అతను 3 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. చివర్లో అరంగేట్రం చేసిన మాట్ రెన్‌షా 24 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 21 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కొత్త బంతితో కంగారూలు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రోహిత్ శర్మ 8 పరుగులకే ఔట్ అయ్యాడు. కొత్త వన్డే కెప్టెన్ శుభమాన్ గిల్10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. విరాట్ కోహ్లీ తన ఖాతా కూడా తెరవలేకపోయాడు. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 11 పరుగులకే పెవిలియన్‌కు తిరిగి వెళ్ళాడు. జోష్ హేజిల్‌వుడ్ రోహిత్, అయ్యర్‌లను ఔట్ చేయగా, మిచెల్ స్టార్క్ కోహ్లీని పెవిలియన్‌కు పంపాడు. భారత్ 13.2 ఓవర్లలో కేవలం 45 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
ఆ తర్వాత కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. అక్షర్ 38 బంతుల్లో 31 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ కేవలం 31 బంతుల్లో 38 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వాషింగ్టన్ సుందర్ 10 పరుగులు చేయగా, నితీష్ రెడ్డి అజేయంగా 19 పరుగులు చేసి టీమిండియా స్కోర్‌ను 130 దాటించాడు. ఆస్ట్రేలియా తరఫున మాథ్యూ కూన్హెమన్, మిచెల్ ఓవెన్, జోష్ హేజిల్‌వుడ్ తలో 2 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ చెరో వికెట్ పడగొట్టారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..