
T20 Records : టీమిండియా దూకుడు చూస్తుంటే రికార్డులన్నీ గల్లంతు కావాల్సిందే అనిపిస్తోంది. గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం కేవలం భారత్‌కు సిరీస్‌ను మాత్రమే అందించలేదు, పొరుగు దేశం పాకిస్థాన్‌కు పెద్ద టెన్షన్ మొదలయ్యేలా చేసింది. గత 8 ఏళ్లుగా పాక్ పేరిట ఉన్న ఒక అరుదైన రికార్డును భారత్ ఇప్పుడు సమం చేయడమే ఇందుకు కారణం.
గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 10 ఓవర్లలోనే ఊదేశింది. ఈ అద్భుత విజయంతో టీమిండియా వరుసగా 11వ టీ20 సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. గతంలో పాకిస్థాన్ జట్టు 2016 నుంచి 2018 మధ్య కాలంలో వరుసగా 11 టీ20 సిరీస్‌లు గెలిచి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇతర అగ్రశ్రేణి జట్టు కూడా ఆ రికార్డు దరిదాపుల్లోకి రాలేకపోయింది. కానీ ఇప్పుడు టీమిండియా సరిగ్గా ఆ 11వ సిరీస్ మైలురాయిని తాకి పాక్ రికార్డును సమం చేసింది. మరో సిరీస్ గెలిస్తే అత్యధిక వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఈ పరిణామం పాక్ అభిమానులను, ఆ దేశ బోర్డును ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం భారత్ ఉన్న ఫామ్ చూస్తుంటే ఎవరూ అడ్డుకోలేరనిపిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత్ ఇలాంటి భీకరమైన ఆట తీరును ప్రదర్శించడం ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. గౌహతి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చేసిన విధ్వంసం టీమిండియా బ్యాటింగ్ లోతును చాటిచెప్పింది. బౌలింగ్‌లో కూడా బుమ్రా, రవి బిష్ణోయ్ వంటి వారు అత్యుత్తమ ప్రదర్శనతో కివీస్ పతనాన్ని శాసించారు.
వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా పోరుకు ముందు టీమిండియా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటే, అటు పాక్ జట్టు మాత్రం కెప్టెన్సీ మార్పులు, ప్లేయర్ల ఫామ్ లేమితో సతమతమవుతోంది. ఒకవేళ భారత్ తన తదుపరి టీ20 సిరీస్‌ను కూడా గెలిస్తే, పాక్ రికార్డు కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ భయం పాకిస్థాన్ క్రికెట్ సర్కిల్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఛాంపియన్ తరహాలో ఆడుతున్న భారత్.. ఈసారి వరల్డ్ కప్ ఫేవరెట్‌గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..