India vs England : జైస్వాల్‌కు షాక్.. భారత్-ఇంగ్లాండ్ సిరీస్ బెస్ట్ XI ఇదే.. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!

భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లతో కూడిన ఒక బెస్ట్ ప్లేయింగ్ XIను రూపొందించారు. ఈ జట్టులో కెప్టెన్‌గా బెన్ స్టోక్స్, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, బెన్ డకెట్‌కు చోటు లభించింది. బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో చూద్దాం.

India vs England : జైస్వాల్‌కు షాక్.. భారత్-ఇంగ్లాండ్ సిరీస్ బెస్ట్ XI ఇదే.. కెప్టెన్‌గా బెన్ స్టోక్స్!
India Vs England

Updated on: Aug 05, 2025 | 6:38 PM

India vs England : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఒకానొక సమయంలో ఇంగ్లాండ్ జట్టు విజయం ఖాయం అనిపించినప్పటికీ.. ఓవల్ టెస్టులో చివరికి 6 పరుగుల తేడాతో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ 754 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ 23 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో బాగా రాణించిన ఆటగాళ్లతో ఒక బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ చూద్దాం.

ఓపెనర్లు, మిడిల్ ఆర్డర్

ఈ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఓపెనింగ్ స్థానాలు కేఎల్ రాహుల్, బెన్ డకెట్లకు దక్కాయి. రాహుల్ ఈ సిరీస్‌లో 532 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకోగా, బెన్ డకెట్ 462 పరుగులు చేసి తన దూకుడు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి సిరీస్‌లో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు సాధించారు. యశస్వి జైస్వాల్ మంచి ప్రదర్శన కనబరిచినప్పటికీ ఈ జట్టులో ప్లేస్ దక్కించుకోలేకపోయాడు. మిడిల్ ఆర్డర్‌లో జో రూట్‌కు నెం.3 స్థానం లభించింది. ఈ సిరీస్‌లో రూట్ 537 పరుగులు చేశాడు. నాల్గవ స్థానంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఉంటాడు. అతను సిరీస్‌లో 4 సెంచరీలతో కలిపి 754 పరుగులతో జట్టుకు కీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ఐదవ స్థానంలో హ్యారీ బ్రూక్ (481 పరుగులు), ఆరవ స్థానంలో వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ (479 పరుగులు) ఉంటారు.

ఆల్‌రౌండర్లు, బౌలర్లు

ఈ జట్టుకు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ కెప్టెన్సీ వహిస్తాడు. అతను సిరీస్‌లో 304 పరుగులు చేయడమే కాకుండా 17 వికెట్లు కూడా పడగొట్టాడు. రెండో ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌ను సెలక్ట్ చేశారు. సుందర్ 284 పరుగులు చేసి 7 వికెట్లు కూడా తీశాడు. బౌలింగ్ విభాగంలో ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ సిరాజ్ (23 వికెట్లు) ముందుంటాడు. అతనితో పాటు కేవలం 3 మ్యాచ్‌లలోనే 14 వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా, ఇంగ్లాండ్ తరపున 2 మ్యాచ్‌లలో 9 వికెట్లు పడగొట్టిన జోఫ్రా ఆర్చర్ ఉంటారు.

తుది జట్టు:

కేఎల్ రాహుల్, బెన్ డకెట్, జో రూట్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..