
IND Vs AUS : సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో నిరాశపరిచిన బౌలింగ్ విభాగం ఈసారి అద్భుత ప్రదర్శన చేసింది. భారత యువ కెప్టెన్ శుభమాన్ గిల్ ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరుగురు బౌలర్లను ఉపయోగించగా, వారంతా వికెట్లు పడగొట్టడం విశేషం. భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా జట్టు కేవలం 236 పరుగులకే ఆలౌట్ అయింది. యువ సంచలనం హర్షిత్ రాణా 4 వికెట్లు తీసి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. సిరీస్‌లో తొలి విజయాన్ని అందుకోవాలంటే టీమిండియా ముందు ఇప్పుడు 237 పరుగుల లక్ష్యం ఉంది.
సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో భారత బౌలర్లు తొలిసారిగా ఆధిపత్యం చెలాయించారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాను 236 పరుగులకే ఆలౌట్ చేయగలిగారు. భారత కెప్టెన్ శుభమాన్ గిల్ ఈ మ్యాచ్‌లో మొత్తం ఆరుగురు బౌలర్లను ఉపయోగించాడు. ఆశ్చర్యకరంగా, ఈ ఆరుగురు బౌలర్లు కనీసం ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో అత్యంత విజయవంతమైన బౌలర్ యువ పేసర్ హర్షిత్ రాణా నిలిచాడు. హర్షిత్ రాణా ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి తెచ్చి, కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటర్లు నిలబడలేకపోయారు.
హర్షిత్ రాణాకు మిగిలిన బౌలర్లు కూడా అద్భుతంగా సహకరించారు. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ తన స్పిన్‌తో రెండు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. ఇక మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో ఒక వికెట్ పడగొట్టి ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తెరదించారు. జట్టులోని అందరు బౌలర్లు వికెట్లు పడగొట్టడం భారత జట్టుకు సానుకూల అంశం.
ఆసిస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (25 బంతుల్లో 29) మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్, కెప్టెన్ మిచెల్ మార్ష్ (41)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయగా.. వన్‌డౌన్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ (30) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఫెవిలియన్ బాట పట్టాడు. కోహ్లి అద్భుత క్యాచ్ అందుకుని షార్ట్‌ను అవుట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అలెక్స్ క్యారీ (24), కూపర్ కన్నోలి (23), మిచెల్ ఓవెన్ (1) రూపంలో మూడు కీలక వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. జోష్ హాజిల్‌వుడ్ (0)ను కూడా అవుట్ చేశాడు. మొత్తంగా 8.4 ఓవర్లు బౌల్ చేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు రాణా తన ఖాతాలో వేసుకున్నాడు.
Harshit Rana finishes things off in style.
Gets two wickets in an over as Australia are all out for 236 runs in 46.4 overs.
Scorecard – https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/LtZ6WpCJc7
— BCCI (@BCCI) October 25, 2025
ఆసీస్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (56) టాప్ రన్ స్కోరర్ కాగా.. లోయర్ ఆర్డర్లో నాథన్ ఎల్లిస్ (16) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్ (2), జంపా (2*) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియాను 236 పరుగులకే ఆలౌట్ చేయడంతో, ఈ మ్యాచ్‌లో గెలవడానికి టీమిండియా ముందు 237 పరుగుల లక్ష్యం ఉంది. సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-0 తేడాతో గెలిచినప్పటికీ, ఈ మ్యాచ్ గెలిచి పరువు నిలుపుకోవాలని భారత్ భావిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..