టీ20 ప్రపంచకప్ విజేతలకు ‘నాడా’ షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!

Anti-Doping Testing Pool: 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టిన ఇద్దరు కీలక ఆటగాళ్లకు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రీడల్లో పారదర్శకతను పెంచేందుకు ఈ స్టార్ క్రికెటర్లను రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో చేర్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

టీ20 ప్రపంచకప్ విజేతలకు నాడా షాక్? డోపింగ్ టెస్ట్ జాబితాలోకి ఇద్దరు టీమిండియా ప్లేయర్లు..!
Team India

Updated on: Apr 15, 2026 | 5:03 PM

Anti-Doping Testing Pool: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టులోని ఇద్దరు ప్రముఖ ఆటగాళ్లు ఇప్పుడు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నిఘా నీడలోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్న ఈ ఆటగాళ్లను తమ పరీక్షల జాబితాలో చేర్చుతున్నట్లు నాడా అధికారికంగా వెల్లడించింది. భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలిచి, మూడుసార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసలు ఏమిటీ నాడా టెస్టింగ్ పూల్?

దేశంలోని వివిధ క్రీడలకు చెందిన అగ్రశ్రేణి అథ్లెట్లు నిషేధిత ఉత్ప్రేరకాలు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయడం ఈ సంస్థ ప్రధాన విధి. దీని కోసం ‘రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్’ పేరుతో ఒక జాబితాను నిర్వహిస్తుంది. ఈ జాబితాలో ఉన్న క్రీడాకారులు ప్రతిరోజూ తాము ఎక్కడ ఉంటామో ఆ వివరాలను (వేర్‌అబౌట్స్) ముందుగానే సంస్థకు తెలపాలి. సంస్థ ప్రతినిధులు ఎప్పుడైనా, ఎక్కడైనా వచ్చి వారి రక్త లేదా మూత్ర నమూనాలను సేకరిస్తారు. ఒకవేళ ఏ ఆటగాడైనా వరుసగా మూడుసార్లు తమ చిరునామా వివరాలు తెలపడంలో విఫలమైతే, అది డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇది కూడా చదవండి: Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్‌గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!

ఇవి కూడా చదవండి

జాబితాలో చేరిన అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్..

తాజా సమాచారం ప్రకారం, డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌లను నాడా ఈ జాబితాలో చేర్చింది. గతంలో ఈ జాబితాలో ఉన్న స్మృతి మంధాన, శ్రేయస్ అయ్యర్ స్థానంలో వీరిని ఎంపిక చేశారు. ప్రపంచకప్ విజయానంతరం ప్రస్తుతం అభిషేక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇకపై వీరు తమ రోజువారీ షెడ్యూల్‌ను నాడాతో పంచుకోవాల్సి ఉంటుంది.

నిఘాలో ఉన్న ఇతర క్రికెటర్లు..

ప్రస్తుతం నాడా వద్ద ఉన్న 348 మంది అథ్లెట్ల జాబితాలో క్రికెటర్ల సంఖ్య గణనీయంగా ఉంది. అభిషేక్, అక్షర్‌లతో పాటు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, తిలక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఇప్పటికే డోపింగ్ నిఘాలో కొనసాగుతున్నారు. క్రీడా స్ఫూర్తిని కాపాడటంలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us