India vs Bangladesh: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం.. 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లా..

|

Jan 20, 2024 | 9:56 PM

U19 World Cup 2024, India vs Bangladesh: దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని స్టేడియంలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన U19 ప్రపంచ కప్ మొదటి మ్యాచ్‌లో, ఉదయ్ సహారన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా 84 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి టోర్నమెంట్‌ను విజయంతో ప్రారంభించింది. దీంతో గ్రూపులో రెండో స్థానంలో నిలిచింది.

India vs Bangladesh: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం.. 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన బంగ్లా..
Ind Vs Ban U19 Wc
Follow us on

U19 World Cup 2024, India vs Bangladesh: అండర్ 19 ప్రపంచ కప్ (U19 World Cup 2024)లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ (India vs Bangladesh) మధ్య దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ఫోంటెయిన్‌లోని స్టేడియంలో నేడు తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఉదయ్ సహారన్ (Uday Saharan)నేతృత్వంలోని టీమ్ ఇండియా బంగ్లాదేశ్ జట్టును ఓడించింది. 84 పరుగులతో ఘన విసయంతో టోర్నీని మొదలుపెట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 76 పరుగులు, కెప్టెన్ ఉదయ్ సహారన్ 64 పరుగుల సహకారంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయి బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లు పూర్తిగా ఆడలేక 45.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగలిగింది. టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఆదర్శ్ – సహారాన్ అర్ధ సెంచరీలు..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి 7 పరుగులకే ఇన్నింగ్స్ ముగించగా, మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ముషీర్ ఖాన్ కూడా 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ ఆదర్శ్ సింగ్‌తో కలిసి కెప్టెన్ ఉదయ్ సహారన్ జట్టు ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. వీరిద్దరూ కలిసి టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లారు.

లోయర్‌ ఆర్డర్‌లో ప్రియాంషు మోలియా, ఆరావళి అవనీష్‌రావు తలో 23 పరుగులు చేశారు. సచిన్ దాస్ 26 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు గౌరవప్రదమైన స్కోరు 251 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తరపున బౌలింగ్‌లో రాణించిన మారుఫ్ అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు.

బంగ్లాదేశ్ 167 పరుగులకు ఆలౌట్..

టీమిండియా నిర్దేశించిన 253 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 45.5 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ జట్టులో అరిఫుల్ ఇస్లాం 41 పరుగులతో ఇన్నింగ్స్ ఆడగా, మహ్మద్ షిహాబ్ జేమ్స్ 54 పరుగులతో పోరాడి ఇన్నింగ్స్ ఆడినా జట్టు విజయ తీరాన్ని తాకలేకపోయింది.

భారత్ తరపున బౌలింగ్‌లో మెరిసిన సౌమ్య పాండే 9.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అతడికి తోడు ముషీర్ ఖాన్ 10 ఓవర్లలో 35 పరుగులిచ్చి రెండు ముఖ్యమైన వికెట్లు తీశాడు. పాయింట్ల పట్టిక గురించి మాట్లాడితే, ఈ విజయంతో టీమ్ ఇండియా రెండు పాయింట్లతో, 1.68 నెట్ రన్ రేట్‌తో గ్రూప్‌లో రెండవ స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..