
India A vs Nepal: భారత్ ఏ జట్టు బౌలర్లు నిప్పులు చెరిగారు. నేపాల్ బ్యాటర్లకు కనీసం పోటీ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తు చేశారు. కేవలం 11.3 ఓవర్లలోనే నేపాల్ ఇన్నింగ్స్‌కు తెరదించారు. దీంతో భారత్ ఏ జట్టు ఏకంగా 306 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. కేవలం 26 పరుగులకే నేపాల్ జట్టు ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్‌లో ఇంకా 38 ఓవర్లకు పైగా మిగిలి ఉండగానే నేపాల్ ఆట ముగిసింది. లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో ఇది ఐదో అత్యల్ప స్కోరుగా నమోదైంది. నేపాల్ బ్యాటర్లు స్కోర్లు 0, 0, 1, 0, 6, 6, 0, 2, 4, 0, 2 చూస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.
ఈ ఘోర పరాజయంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ కీలక పాత్ర పోషించారు. కొత్త బంతితో ఇద్దరూ అద్భుతమైన వేగంతో బౌలింగ్ చేస్తూ బంతిని పదునుగా స్వింగ్ చేయించారు. వారి ధాటికి నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలబడలేకపోయారు.
ముఖ్యంగా తొలి పవర్‌ప్లేలోనే నేపాల్ తొమ్మిది వికెట్లు కోల్పోవడం ఆ జట్టు బ్యాటింగ్ వైఫల్యానికి అద్దం పడుతోంది. హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులతో నేపాల్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు.
మొత్తంగా భారత ఏ జట్టు బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 306 పరుగుల భారీ విజయంతో ప్రత్యర్థి జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది.