IND vs USA : ముంబైలో సూర్య ప్రతాపం..కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న కెప్టెన్ ఇన్నింగ్స్..అమెరికా టార్గెట్ 162

IND vs USA : టాస్ గెలిచిన అమెరికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఊహించినట్టే అమెరికా బౌలర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా, ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) కాసేపు పోరాడారు. అయితే అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ వేసిన ఆరో ఓవర్లో మ్యాచ్ మలుపు తిరిగింది.

IND vs USA : ముంబైలో సూర్య ప్రతాపం..కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న కెప్టెన్ ఇన్నింగ్స్..అమెరికా టార్గెట్ 162
Surya

Edited By:

Updated on: Feb 07, 2026 | 10:05 PM

IND vs USA T20 World Cup 2026 : ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరిత పోరులో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. ఒకానొక దశలో పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. అమెరికా బౌలర్ల ధాటికి స్టార్ బ్యాటర్లు విఫలమైనా, సూర్య ఒంటరి పోరాటం చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు.

టాస్ గెలిచిన అమెరికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఊహించినట్టే అమెరికా బౌలర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్ కాగా, ఇషాన్ కిషన్ (20), తిలక్ వర్మ (25) కాసేపు పోరాడారు. అయితే అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ వేసిన ఆరో ఓవర్లో మ్యాచ్ మలుపు తిరిగింది. ఒకే ఓవర్లో ఇషాన్, తిలక్, శివం దూబేలను అవుట్ చేసి భారత్ నడ్డి విరిచాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ కూడా విఫలమవడంతో భారత్ వంద పరుగులు దాటడం కష్టమే అనిపించింది.

క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్ని అంతా రంగరించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం తొందరపడకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. మొదట నెమ్మదిగా ఆడినా, క్రీజులో కుదురుకున్నాక అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్య, చివరికి 49 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 84 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్ పటేల్(14)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 161 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.

అమెరికా బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ, మ్యాచ్ చివరలో ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయపడటం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మెయిన్ బౌలర్ అలీ ఖాన్ 18వ ఓవర్ వేస్తూ మధ్యలోనే మైదానాన్ని వీడగా, అతని ఓవర్‌ను పూర్తి చేసిన శుభమ్ రంజనే కూడా మోకాలి నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఇక 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనున్న అమెరికాను భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. బుమ్రా లేని లోటును మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ భర్తీ చేయాల్సి ఉంది. వాంఖడే పిచ్‌పై మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం భారత్‌కు సవాలుతో కూడుకున్న పని.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..