
IND vs SL: శ్రీలంకతో జరిగే ప్రతిష్టాత్మక తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియా వ్యూహాల మీద బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గాల్ స్టేడియంలో స్పిన్‌కు అనుకూలించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కోచ్ మోర్నే మోర్కెల్ మీడియా సమావేశంలో తెలిపారు. రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుథార్ రూపంలో ముగ్గురు డిఫరెంట్ స్టైల్ కలిగిన స్పిన్నర్లు అందుబాటులో ఉండడం జట్టుకు పెద్ద కలిసివచ్చే అంశమని పేర్కొన్నారు. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ మారుతుందని, స్పిన్నర్లు మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటారని ఆయన స్పష్టం చేశారు.
డిఫరెంట్ స్టైల్స్.. శ్రీలంకకు కష్టాలే
ఈ ముగ్గురు స్పిన్నర్ల బౌలింగ్ వైవిధ్యం గురించి మోర్కెల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. కుల్‌దీప్ యాదవ్ తన లెఫ్టార్మ్ చైనామాన్ స్పిన్‌తో ఏ క్షణంలోనైనా వికెట్లు తీయగల అటాకింగ్ బౌలర్. జడేజా తన సునిశితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ ఒత్తిడి పెంచుతాడు. ఇక మానవ్ సుథార్ క్లాసికల్ శైలిలో బంతిని గాల్లో తిప్పుతూ టర్న్ రాబడతాడు. ఈ ముగ్గురి వద్ద ఉన్న నైపుణ్యం ప్రత్యర్థి 20 వికెట్లను పడగొట్టడానికి సరిపోతుందని, వీరిని సరైన సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎలా ఉపయోగిస్తాడనేది ఆసక్తికరంగా మారనుందని వ్యాఖ్యానించారు.
పేస్ విభాగంలో ఎవరికి అవకాశం?
పేస్ బౌలింగ్ విభాగానికి వస్తే సీనియర్ మహమ్మద్ సిరాజ్‌కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ లేదా గుర్‌నూర్ బ్రార్‌లలో ఒకరికి అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి టెస్టుల్లో పరిమిత అనుభవమే ఉన్నప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో కష్టమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేసిన అనుభవం బాగా ఉపయోగపడుతుందని మోర్కెల్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీలంకలో ఉండే విపరీతమైన వేడి, ఉక్కపోతను తట్టుకుని బౌలింగ్ చేయడమే ఇక్కడ ప్రధాన సవాలు అని చెప్పారు. 20 నుంచి 35 ఓవర్ల తర్వాత కూకబుర్రా బంతి మెత్తబడినప్పుడు పేసర్లు తెలివిగా క్రీజును వాడుకుంటూ, షార్ట్ బాల్స్ విసురుతూ ఒత్తిడి తేవాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..