IND vs SA ODI Series: తొలి వన్డేలో టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు.. ఎవరెవరున్నారంటే?
Team India Probable Playing 11: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 19న పార్ల్‌లో జరుగుతుంది.
IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా(India vs South Africa) జట్ల మధ్య జనవరి 19 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌లో ఆతిథ్య జట్టుతో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే వన్డే సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా టీమ్ ఇండియా(Team India) ఈ పర్యటనను ముగించాలనుకుంటోంది. భారత జట్టు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ సిరీస్‌లో ఆడడం లేదు. అతని స్థానంలో కేఎల్ రాహుల్(KL Rahul)కు జట్టు కమాండ్‌ని అప్పగించారు. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు.
వన్డే మ్యాచ్‌లు ఎప్పుడు ఆడతారు? మూడు వన్డేల సిరీస్‌లో మొదటి మ్యాచ్ జనవరి 19న పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరగనుంది. రెండో వన్డే జనవరి 21న పార్ల్‌లోని బోలాండ్ పార్క్‌లో జరగనుంది. మూడో వన్డే కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది.
గత పర్యటనలో భారత్ విజయం.. గత దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 6 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 5-1తో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి టీమ్ ఇండియా చరిత్ర పునరావృతం చేయాలని భావిస్తోంది. యువ ఆటగాళ్లతో కళకళలాడుతున్న టీమ్ ఇండియాకు టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు చక్కటి అవకాశం ఉంది.
తొలి వన్డే కోసం టీమిండియా ప్లేయింగ్ XI అంచనా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), వెంకటేష్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్.
టీమిండియాకు అంత సులభం కాదు.. టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అద్భుతంగా రాణించినందున భారత జట్టు వన్డే సిరీస్ గెలవడం అంత తేలికైన విషయం కాదు. ఆఫ్రికా పిచ్‌లు ఫాస్ట్ పేస్, బౌన్స్‌కు ప్రసిద్ధి చెందాయి. ఆతిథ్య జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు.