IND vs SA 5th T20 : హార్దిక్-తిలక్ ప్రళయం.. బుమ్రా-వరుణ్ మాయాజాలం.. సౌతాఫ్రికా కోట బద్దలు.. సిరీస్ మనదే!

IND vs SA 5th T20 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా వీరవిహారం చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుని, సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. సొంత గడ్డపై సౌతాఫ్రికా పై టీ20 సిరీస్ గెలవలేదన్న దశాబ్దాల నిరీక్షణకు సూర్యకుమార్ సేన తెరదించింది.

IND vs SA 5th T20 : హార్దిక్-తిలక్ ప్రళయం.. బుమ్రా-వరుణ్ మాయాజాలం.. సౌతాఫ్రికా కోట బద్దలు.. సిరీస్ మనదే!
Ind Vs Sa 5th T20

Updated on: Dec 19, 2025 | 11:07 PM

IND vs SA 5th T20 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 30 పరుగుల తేడాతో చిత్తు చేసిన సూర్యకుమార్ సేన, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. సొంత గడ్డపై సౌతాఫ్రికా పై టీ20 సిరీస్ గెలవలేదన్న దశాబ్దాల నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 231 పరుగుల భారీ స్కోరు సాధించగా, ఛేదనలో దక్షిణాఫ్రికా 201 పరుగులకే పరిమితమైంది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్‌లో యువ ఆటగాడు తిలక్ వర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వీరవిహారం చేశారు. తిలక్ వర్మ కేవలం 42 బంతుల్లో 73 పరుగులు (10 ఫోర్లు, ఒక సిక్స్) చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా చెలరేగి కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. భారత్ తరపున ఇది రెండో వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించడంతో భారత్ 231 పరుగుల పర్వతాన్ని నిలబెట్టింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (37), సంజూ శామ్సన్ (34) కూడా రాణించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు క్వింటన్ డి కాక్ (65) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్‌తో కలిసి తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించిన డి కాక్, భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే, 11వ ఓవర్లో జస్‌ప్రీత్ బుమ్రా డి కాక్‌ను అవుట్ చేయడంతో సౌతాఫ్రికా పతనం మొదలైంది. ఆ తర్వాత స్పిన్ మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి మ్యాజిక్ చేశాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ మార్‌క్రమ్, డోనోవన్ ఫెరీరాలను అవుట్ చేసి సౌతాఫ్రికా ఆశలపై నీళ్లు చల్లాడు.

ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (18), జార్జ్ లిండే (16) ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోయింది. బౌలర్ల వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచులో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తనదైన శైలిలో మార్కో జాన్సెన్‌ను అవుట్ చేయగా, అర్ష్‌దీప్ సింగ్ కూడా కీలక వికెట్ తీశాడు. చివరకు సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో భారత్ స్వదేశంలో తన అజేయమైన సిరీస్ రికార్డును 18కి పెంచుకుంది. 2019 తర్వాత టీమ్ ఇండియా సొంత గడ్డపై ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోకపోవడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..