IND vs SA: 9 బంతుల్లో తేలిపోయిన టీమిండియా ఓటమి.. 5 పరుగులు, 5 వికెట్లతో కథ క్లోజ్..

IND vs SA: రెండో టీ20లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు గతంలో ఏ జట్టు కూడా భారత్‌పై సాధించని ఘనతను సాధించారు. దీంతో దక్షిణాఫ్రికా కొత్త రికార్డును సృష్టించింది.

IND vs SA: 9 బంతుల్లో తేలిపోయిన టీమిండియా ఓటమి.. 5 పరుగులు, 5 వికెట్లతో కథ క్లోజ్..
Ind Vs Sa 2nd T20i Records

Updated on: Dec 12, 2025 | 8:16 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఛేజింగ్‌లో చతికిలపడిన భారత జట్టు కేవలం 9 బంతుల వ్యవధిలోనే చివరి 5 వికెట్లను కోల్పోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొహాలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది. అనంతరం 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 17.4 ఓవర్ల వరకు 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కానీ ఆ తర్వాతి 9 బంతుల్లోనే కేవలం 5 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 5 వికెట్లను కోల్పోయింది.

ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా పేసర్లు భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. టీ20 చరిత్రలో భారత జట్టుపై ఓ మ్యాచ్‌లో పదికి పది వికెట్లూ పేసర్లే తీయడం ఇదే తొలిసారి. ఒట్నీల్ బార్ట్‌మన్ 4 వికెట్లతో చెలరేగగా, మిగతా పేసర్లు కూడా రాణించారు. బార్ట్‌మన్ 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి, భారత్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.

రికార్డుల మోత..

ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌పై టీ20ల్లో అత్యధిక విజయాలు (13) సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాను (12) అధిగమించింది. తొలి టీ20లో ఘన విజయం సాధించిన భారత్, రెండో మ్యాచ్‌లో మాత్రం పేలవమైన బ్యాటింగ్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది.

కాగా, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లలో జితేష్ శర్మ, తిలక్ వర్మ వంటి వారు కూడా నిలవలేకపోయారు. బార్ట్‌మన్ ఒకే ఓవర్లో (19వ ఓవర్) మూడు వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు.

ఈ ఓటమితో సిరీస్ ఉత్కంఠభరితంగా మారింది. మూడో మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..