
IND vs SA 1st T20 : భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో రికార్డ్ విజయాన్ని నమోదు చేసింది. కటక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 59 పరుగులతో హాఫ్ సెంచరీ చేయడంతో, భారత జట్టు 175 పరుగులు చేయగలిగింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా జట్టు కేవలం 74 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒక పెద్ద రికార్డు నెలకొల్పగా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చరిత్ర పుస్తకాల్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బద్దలైన ఆ 5 ముఖ్యమైన రికార్డులేంటో తెలుసుకుందాం.
1. బుమ్రా వికెట్ల సెంచరీ
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు పూర్తి చేసిన రెండవ భారతీయ బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా తన టీ20 కెరీర్‌లో కేవలం 78వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు ఈ మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించాడు.
2. వికెట్ కీపర్ అత్యధిక డిస్మిసల్స్
ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ జితేష్ శర్మ దక్షిణాఫ్రికాపై 4 డిస్మిసల్స్ చేసి, ఒకే టీ20 మ్యాచ్‌లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన భారతీయ వికెట్ కీపర్ల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నాడు. గతంలో ఎంఎస్ ధోనీ నాలుగు సందర్భాలలో ఒకే టీ20 మ్యాచ్‌లో 5 డిస్మిసల్స్ చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
3. హార్దిక్ పాండ్యా 100 సిక్సర్లు
భారత జట్టు ఆల్‌రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన నాల్గవ భారతీయ బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు రోహిత్ శర్మ (205), సూర్యకుమార్ యాదవ్ (155), విరాట్ కోహ్లీ (124) ఈ మైలురాయిని చేరుకున్నారు.
4. దక్షిణాఫ్రికాపై భారత్‌కు భారీ విజయం
కటక్‌లో భారత్ దక్షిణాఫ్రికాను 101 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో, ఇది దక్షిణాఫ్రికాపై భారత్‌కు లభించిన మూడవ అతిపెద్ద విజయం. అంతేకాకుండా సొంత గడ్డపై (భారత్‌లో) దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం.
5. చిన్న వయసులో 1000 పరుగులు పూర్తి
యంగ్ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ 25 ఏళ్ల లోపు వయస్సులో 1000 టీ20 పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ఘనతను అతను తన 23 సంవత్సరాల 31 రోజుల వయస్సులో సాధించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.