IND vs PAK: పాక్ ఓడిపోయినా ఈసారి టీవీలు పగలగొట్టలేరు.. దాయాది దీన స్థితిని బయట పెట్టిన మాజీ క్రికెటర్

భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ పోరుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్‌లోని అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయినప్పటికీ, అభిమానులు ఈసారి టీవీలు పగలగొట్టలేరంటున్నాడు పాక్ మాజీ ప్లేయర్.

IND vs PAK: పాక్ ఓడిపోయినా ఈసారి టీవీలు పగలగొట్టలేరు.. దాయాది దీన స్థితిని బయట పెట్టిన మాజీ క్రికెటర్
Ind Vs Pak Match

Updated on: Feb 22, 2025 | 1:12 PM

భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన ప్రతిసారి ఇండియాలో ఆనందం వెల్లివిరుస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ అభిమానులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోతుంటారు. భారత్ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేక అభిమానులు టీవీలు పగలగొడుతుంటారు. అయితే ఈసారి మాత్రం ఆ ఛాన్స్ లేదంటున్నాడు ఆ జట్టు మాజీ జట్టు ఆటగాడు బాసిత్ అలీ. ఫిబ్రవరి 23న జరగనున్న భారత్, పాకిస్తాన్ మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీం ఇండియా గెలవడం దాదాపు ఖాయమంటున్నాడు అలీ. అయితే, ఈసారి పాకిస్తాన్ ఓడిపోతే అభిమానులు టీవీలపై తమ ప్రతాపాన్ని చూపించలేరని ఈ మాజీ క్రికెటర్ అంటున్నాడు. దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా ముగిసినప్పటికీ, పాకిస్తాన్ అభిమానులు టీవీని పగలగొట్టే సాహసం చేయలేదు. ఇక్కడి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ప్రజలు చిన్నదానికి కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించవలసి వస్తుంది. కాబట్టి ఈసారి పాకిస్తాన్ జట్టు ఓడిపోయినా, టీవీ సెట్లు పగిలిపోయిన శబ్దం వినిపించదని బాసిత్ అలీ అన్నారు.

ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో భారత్ జట్టే ఫేవరెట్ అని బాసిత్ అలీ అన్నారు. అదే సమయంలో ఇది పాకిస్తాన్‌కు డూ-ఆర్-డై మ్యాచ్ అని అన్నారు. ఒక విధంగా దీనిని ఫైనల్ మ్యాచ్ అని పిలవవచ్చు. ఈ మ్యాచ్‌లో ఓడితే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్ర్కమిస్తుంది. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్‌లో జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కాగా ఈ మ్యాచ్‌లో భారత్  సెమీ ఫైనల్ అవకాశాలను మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. రోహిత్ శర్మ, కోహ్లీ, హార్దిక్, షమీ వంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించనున్నారు. మరో వైపు, పాకిస్తాన్ గాయాల సమస్యతో సతమతమవుతోంది. బాబర్ అజామ్ నెమ్మదిగా ఆడటంపై విమర్శలు వస్తుండగా, ఫఖర్ జమాన్ గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. పాక్  ఆశలన్నీ బౌలింగ్ విభాగంపైనే ఉన్నాయి. షా హీన్ అఫ్రిది, హరిస్ రౌఫ్, నసీమ్ షా మెరుగ్గా బౌలింగ్ చేస్తుండడం ఆ జట్టుకు పెద్ద సానుకూలాంశం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..