Asia Cup 2022: ఇండియా-పాక్ ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్ వేళ కశ్మీర్ NIT క్యాంపస్‌లో కఠిన ఆంక్షలు విధించారు. మ్యాచ్ సందర్భంగా విద్యార్ధులు బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్ రూమ్‌ల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. మ్యాచ్‌కు సంబంధించి సోషల్‌మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయరాదని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘించిన విద్యార్ధులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారు రూ.5000 జరిమానాతో పాటు కాలేజ్ నుంచి బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు.
ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్‌ను విద్యార్ధులు గ్రూపులుగా చూడరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. మ్యాచ్ ముగిసిన తరువాత విద్యార్ధులు ఎలాంటి మీటింగ్‌లు పెట్టవద్దని కోరారు. ఎవరైనా విద్యార్ధులు ఒకే గదిలో కలిసి మ్యాచ్‌ను చూస్తే వాళ్లందరిని డిబార్ చేస్తామని కూడా NIT యాజమాన్యం హెచ్చరించింది.
గత ఏడాది ఇండోపాక్ టీ-20 మ్యాచ్ సందర్భంగా కొందరు విద్యార్ధులు పాక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంపై రచ్చ జరిగింది. విద్యార్ధుల మధ్య గతంలో ఘర్షణలు కూడా చెలరేగాయి. అందుకే ముందుజాగ్రత్తగా ఈసారి కఠిన ఆంక్షలు విధించారు.