IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: రాయ్‌పూర్‌ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా పంజా విసిరింది. కివీస్ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు మట్టికరిపించారు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ
Team India Wins

Updated on: Jan 23, 2026 | 10:47 PM

IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఒక అద్భుతమైన ఛేజింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజూ శామ్సన్ (6) పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ కివీస్ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 8 ఓవర్లలోనే స్కోరును 100 దాటించారు.

ముఖ్యంగా ఇషాన్ కిషన్ విధ్వంసం మామూలుగా లేదు. కేవలం 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి భారత్ గెలుపును ఖాయం చేశాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ను చాటుకుంటూ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఒక ఏడాది తర్వాత సూర్య తన ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్‌తో 360 డిగ్రీల షాట్లతో రాయ్‌పూర్ ఫ్యాన్స్‌ను అలరించాడు. సూర్య 37 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్) చేసి ఆఖరి వరకు నిలబడి మ్యాచ్‌ను ముగించాడు. అతనికి తోడుగా శివమ్ దూబే (36 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ కేవలం 15.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. అంటే మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయం సాధించడం విశేషం.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 27 బంతుల్లో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా, రచిన్ రవీంద్ర (44) కూడా రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసి కివీస్‌ను కొంతవరకు కట్టడి చేయగలిగాడు. అయినప్పటికీ, కివీస్ భారీ స్కోరు సాధించినా.. అది భారత బ్యాటర్ల ధాటి ముందు ఏమాత్రం సరిపోలేదు.

ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రాయ్‌పూర్‌లో టీమిండియా ఆడుతున్న 100వ హోమ్ టీ20 మ్యాచ్‌లో ఇంతటి అద్భుత విజయం సాధించడం అభిమానులకు మర్చిపోలేని తీపి జ్ఞాపకం. ముఖ్యంగా ఒత్తిడిలో ఇషాన్ కిషన్, సూర్య ఆడిన తీరు వరల్డ్ కప్ 2026 ముందు టీమిండియాకు కొండంత బలాన్ని చేకూర్చింది. ఇక మూడో టీ20లో గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది.