
IND vs NZ Final, T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ సమరం టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ రెండు జట్ల మధ్య పోరు కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి దక్కుతుంది? భారత్ ఛాంపియన్ అవుతుందా లేక న్యూజిలాండా? ఇలాంటి పరిస్థితుల కోసం ఐసీసీ ప్రత్యేక నిబంధనలను రూపొందించింది.
ఇది ఫైనల్ మ్యాచ్ కావడంతో, ఐసీసీ ఎలాగైనా ఫలితాన్ని రాబట్టాలని చూస్తుంది. ఇందుకోసం ఐసీసీ ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే (Reserve Day) కేటాయించింది. మార్చి 8న వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం కాకపోయినా లేదా మధ్యలో ఆగిపోయినా, మరుసటి రోజు (మార్చి 9) రిజర్వ్ డేన మ్యాచ్ నిర్వహిస్తారు. ఒకవేళ మార్చి 8న మ్యాచ్ ప్రారంభమై వర్షం వల్ల ఆగిపోతే, మార్చి 9న ఎక్కడైతే మ్యాచ్ ఆగిందో అక్కడి నుంచే కొనసాగిస్తారు. అంటే మళ్ళీ మొదటి నుంచి ఆడాల్సిన అవసరం ఉండదు. ఫైనల్ కోసం రెండు రోజుల్లోనూ 120 నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంటుంది. ఓవర్లు తగ్గించి అయినా మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 10 ఓవర్లు ఆడటం తప్పనిసరి.
అయితే, రెండు రోజుల్లోనూ ఆట సాధ్యం కాకపోతే ఏమవుతుంది? మార్చి 8, 9 తేదీల్లో మ్యాచ్ నిర్వహించడం సాధ్యపడకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను సంయుక్త విజేతలుగా (Joint Winners) ప్రకటిస్తారు. అంటే భారత్, న్యూజిలాండ్ ఇద్దరూ ఈ టోర్నీకి ఛాంపియన్లుగా నిలుస్తారు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. గతంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, శ్రీలంక జట్లు ఇలాగే టైటిల్‌ను పంచుకున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న టీమ్ ఇండియా, వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవలేదు. భారత జట్టు ఈ రికార్డుకు కేవలం ఒక్క విజయ దూరంలో ఉంది. అయితే, మరోవైపు తన తొలి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న న్యూజిలాండ్ గట్టి పోటీనిస్తోంది. పైగా, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్ ఇప్పటివరకు విజయం సాధించలేకపోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..