IND vs NZ : కివీస్‌తో వన్డే సిరీస్‌..టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?

IND vs NZ : న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం భారత జట్టులో భారీ మార్పులు జరగనున్నాయి. శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి వస్తుండగా.. తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్ జట్టుకు దూరం కానున్నారు. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో గాయపడిన గిల్, ప్రస్తుతం కోలుకుని జట్టు పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.

IND vs NZ : కివీస్‌తో వన్డే సిరీస్‌..టీమిండియాలో భారీ మార్పులు..అయ్యర్, గిల్ ఇన్..ఆ ఇద్దరు అవుట్?
Ind Vs Nz Odi Squad

Updated on: Dec 28, 2025 | 3:45 PM

IND vs NZ : టీమిండియా తదుపరి మిషన్ న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమవుతోంది. జనవరి 11 నుంచి కివీస్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. సౌతాఫ్రికా పర్యటన ముగిసిన వెంటనే స్వదేశంలో జరిగే ఈ సిరీస్ కోసం భారత జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా గాయాల వల్ల దూరమైన స్టార్ ప్లేయర్లు తిరిగి జట్టులోకి వస్తుండటంతో, కొందరు యువ ఆటగాళ్లకు మొండిచేయి తప్పేలా లేదు.

న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో గాయపడిన గిల్, ఇప్పుడు పూర్తిగా కోలుకుని జట్టు పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్, ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. వీరిద్దరూ రావడం జట్టు బ్యాటింగ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయనుంది. గిల్ కెప్టెన్‌గా, అయ్యర్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.

గిల్, అయ్యర్ రాకతో సౌతాఫ్రికాతో వన్డేలు ఆడిన తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్‌ జట్టు నుంచి తప్పుకోవాల్సి రావచ్చు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఉండటంతో జురెల్‌కు చోటు దక్కడం కష్టమే. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో దుమ్మురేపుతున్న దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్లకు కూడా వన్డే జట్టులో ఇప్పుడప్పుడే అవకాశం వచ్చేలా లేదు. కేవలం టీ20లకే పరిమితమైన వీరిని వన్డేలకు ప్రస్తుతానికి పక్కన పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇక సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఇది అగ్నిపరీక్ష లాంటిది. గత కొన్ని మ్యాచులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న జడేజాకు, సెలక్టర్లు ఇది చివరి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఇక్కడ కూడా విఫలమైతే వాషింగ్టన్ సుందర్ శాశ్వతంగా ఆ స్థానాన్ని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్‌ను కూడా పక్కన పెట్టే అవకాశం ఉండటం గమనార్హం.

భారత జట్టు (అంచనా): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (కీపర్), రిషబ్ పంత్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా.