
IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్ గాయపడ్డాడు. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో త్రో-డౌన్ స్పెషలిస్ట్ వేసిన బంతి పంత్ పక్కటెముకల పైభాగంలో బలంగా తగిలింది. దీంతో అతను తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. వెంటనే బీసీసీఐ (BCCI) మెడికల్ టీమ్ అతనికి పరీక్షలు నిర్వహించి, ఎంఆర్‌ఐ (MRI) స్కాన్ చేయించింది. పరీక్షల్లో పంత్‌కు ‘సైడ్ స్ట్రెయిన్’ అయినట్లు తేలింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి సమయం పట్టనుండటంతో అతను సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
పంత్ దూరం కావడంతో అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనే చర్చలో ఈశాన్ కిషన్ పేరు వినిపించినప్పటికీ, సెలెక్టర్లు ధ్రువ్ జురెల్ వైపే మొగ్గు చూపారు. 24 ఏళ్ల జురెల్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటికే భారత్ తరపున టెస్టులు, టీ20ల్లో ఆకట్టుకున్న జురెల్, ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
ధ్రువ్ జురెల్ ఎంపికకు ప్రధాన కారణం అతను విజయ్ హజారే ట్రోఫీలో కనబరుస్తున్న అసాధారణ ప్రదర్శనే. ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జురెల్, ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌ల్లో 90కి పైగా సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లోయర్ ఆర్డర్‌లో వచ్చి మ్యాచ్‌లను ఫినిష్ చేయడంలో అతను దిట్ట అని పేరు తెచ్చుకున్నాడు.
రిషబ్ పంత్ స్థానంలో జురెల్ జట్టులోకి వచ్చినప్పటికీ, మొదటి వన్డే తుది జట్టులో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే, పంత్ దూరం కావడంతో జురెల్ రూపంలో భారత్‌కు ఒక బలమైన బ్యాకప్ వికెట్ కీపర్ లభించినట్లయింది.
రిషబ్ పంత్ వంటి కీలక ఆటగాడు దూరం కావడం టీమ్ ఇండియాకు ప్రతికూలాంశమే అయినప్పటికీ, ధ్రువ్ జురెల్ వంటి ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడికి ఇది పెద్ద అవకాశం. ఈ సిరీస్ ద్వారా జురెల్ వన్డేల్లో తన ముద్ర వేస్తాడో లేదో వేచి చూడాలి.
భారత్ వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..