IND vs NZ 2nd T20: 60 వేల మంది అభిమానుల మధ్య రెండో పోరు..టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఉంటాయా?

IND vs NZ 2nd T20: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు రసవత్తర దశకు చేరుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి సమరంలో ఘనవిజయం సాధించిన టీమిండియా, నేడు (శుక్రవారం, జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టీ20లో కివీస్‌తో తలపడనుంది.

IND vs NZ 2nd T20: 60 వేల మంది అభిమానుల మధ్య  రెండో పోరు..టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు ఉంటాయా?
Ind Vs Nz

Updated on: Jan 23, 2026 | 6:13 PM

IND vs NZ 2nd T20: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఇప్పుడు రసవత్తర దశకు చేరుకుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి సమరంలో ఘనవిజయం సాధించిన టీమిండియా, నేడు (శుక్రవారం, జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టీ20లో కివీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన ఉవ్విళ్లూరుతుంటే, ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పర్యాటక జట్టు భావిస్తోంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

తొలి టీ20లో 48 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్.. ఫుల్ జోష్‌లో ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజూ శామ్సన్ ఫామ్‌లో ఉండటం జట్టుకు పెద్ద బలం. నాగ్‌పూర్‌లో టీమిండియా ఏకంగా 238 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. బౌలింగ్‌లోనూ వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్ రాణిస్తున్నారు. అయితే గత మ్యాచ్‌లో జరిగిన ఫీల్డింగ్ తప్పిదాలను సరిదిద్దుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. నేటి మ్యాచ్‌లో గెలిస్తే సిరీసులో భారత్ పై చేయి సాధిస్తుంది. కాబట్టి ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకూడదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన జట్టును హెచ్చరించాడు.

రాయ్‌పూర్ స్టేడియం గురించి చెప్పాలంటే.. ఇది దాదాపు 60,000 మంది ప్రేక్షకులతో నిండిపోనుంది. ఛత్తీస్‌గఢ్ ఫ్యాన్స్ టీమిండియా యాక్షన్‌ను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక్కడ గతంలో జరిగిన రికార్డులను పరిశీలిస్తే, 2025 డిసెంబర్‌లో జరిగిన వన్డేలో ఏకంగా 350 పైగా పరుగులు నమోదయ్యాయి. కానీ, ఆ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ఛేజ్ చేసింది. అంటే ఇక్కడ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని, ఛేజింగ్ చేయడం సులభమని స్పష్టమవుతోంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రాత్రి వేళ మంచు కురిసే (Dew) అవకాశం ఉండటం వల్ల సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడం కష్టతరంగా మారుతుంది.

న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే.. వారు తక్కువ అంచనా వేయలేం. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మ్యాన్ వంటి ఆటగాళ్లు ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. కివీస్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్ కెప్టెన్సీలో ఈసారి మరిన్ని వ్యూహాలతో బరిలోకి దిగనున్నారు. గత మ్యాచ్‌లో మిస్సైన కైల్ జేమీసన్ లేదా ఇష్ సోధి లాంటి వారు ఈ పిచ్‌పై కీలకం కావచ్చు. మరోవైపు టీమ్ ఇండియాలో కుల్దీప్ యాదవ్ లేదా అక్షర్ పటేల్‌లలో ఎవరిని ఎంచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రాయ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు కూడా కొంత సహకరించే అవకాశం ఉంది.

మొత్తానికి ప్రెడిక్షన్ మీటర్ ప్రకారం.. భారత్ గెలిచే అవకాశాలు 75 శాతం ఉండగా, న్యూజిలాండ్‌కు 25 శాతం ఛాన్స్ ఉంది. అయితే క్రికెట్‌లో ఏ క్షణంలోనైనా ఫలితం మారవచ్చు. కివీస్ జట్టు గనుక పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగితే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ నుంచి మరో మెరుపు ఇన్నింగ్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

టీమిండియా తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా): టిమ్ రాబిన్సన్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మ్యాన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..