AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ND vs NZ 2nd ODI : కివీస్ చేతిలో టీమిండియా చిత్తు..రాజ్ కోట్ వన్డేలో భారత్ ఓటమికి అసలైన కారణాలివే

IND vs NZ 2nd ODI : రాజ్ కోట్‌లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీతో ఆదుకున్నప్పటికీ, డారిల్ మిచెల్ వీరోచిత ఇన్నింగ్స్ ముందు భారత్ తలవంచక తప్పలేదు. ఈ ఓటమికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.

ND vs NZ 2nd ODI : కివీస్ చేతిలో టీమిండియా చిత్తు..రాజ్ కోట్ వన్డేలో భారత్ ఓటమికి అసలైన కారణాలివే
Ind Vs Nz 2nd Odi
Rakesh
|

Updated on: Jan 15, 2026 | 7:30 AM

Share

IND vs NZ 2nd ODI : రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారత్‌పై ఘనవిజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 285 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలోనే ఛేదించింది. డారిల్ మిచెల్ అజేయ సెంచరీ (131*) కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించగా, భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. టీమిండియా బ్యాటింగ్, కెప్టెన్సీ లోపాలు, బౌలింగ్ వైఫల్యం ఈ ఘోర పరాజయానికి దారితీశాయి.

బ్యాటింగ్ కుప్పకూలడం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఒక దశలో 70/0 తో బలంగా కనిపించింది. కానీ ఒక్కసారిగా వికెట్లు పారేసుకుని 118 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (24), విరాట్ కోహ్లీ (23), శ్రేయస్ అయ్యర్ (8) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56) అర్ధసెంచరీ చేసినా, దానిని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. కేఎల్ రాహుల్ (112*) వీరోచితంగా పోరాడి 284 పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించినప్పటికీ, టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును దెబ్బతీసింది.

కెప్టెన్ గిల్ తప్పుడు నిర్ణయం

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ప్రారంభంలో 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఆ సమయంలో కివీస్ బ్యాటర్లపై మరింత ఒత్తిడి పెంచేందుకు అనుభవజ్ఞులైన మహమ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణాను బౌలింగ్‌కు దించాల్సింది. కానీ కెప్టెన్ గిల్, నితీష్ రెడ్డితో బౌలింగ్ చేయించాడు. ఇదే అదునుగా భావించిన విల్ యంగ్, డారిల్ మిచెల్ క్రీజులో పాతుకుపోయారు. ఆ ఒక్క నిర్ణయంతో మ్యాచ్ భారత్ చేజారిపోయింది. నితీష్ రెడ్డి ఓవర్లలో కివీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడంతో టీమిండియా పట్టు కోల్పోయింది.

చేతులెత్తేసిన స్పిన్నర్లు

రాజ్ కోట్ లాంటి స్లో పిచ్‌పై స్పిన్నర్లు కీలకం కావాలి. కానీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయకపోగా, పరుగులు ధారాళంగా ఇవ్వడంతో న్యూజిలాండ్ పరుగుల వేగం పెరిగింది. మరోవైపు జడేజా 8 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చినా వికెట్ సాధించలేకపోయాడు. డారిల్ మిచెల్, విల్ యంగ్ భారత స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా, వారి బౌలింగ్‌లో భారీ షాట్లు ఆడి కివీస్ ను విజయతీరాలకు చేర్చారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..