IND vs NZ: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ముందున్న అతిపెద్ద సవాలు న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో నేటినుంచి జరగనున్న తొలి టెస్టుతో సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి. బెంగళూరు టెస్టులో చరిత్ర సృష్టించే గొప్ప అవకాశం టీమిండియా ఆటగాళ్లకు దక్కింది. బెంగళూరు టెస్టులో భారత ఆటగాళ్లు బద్దలు కొట్టగల 5 రికార్డులను ఓసారి చూద్దాం..
రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 37 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు టెస్టులో ఐదు వికెట్లు తీయడంలో అశ్విన్ విజయవంతమైతే, టెస్టు ఫార్మాట్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వార్న్‌ను వెనక్కి నెట్టివేస్తాడు. వార్న్ 145 టెస్టుల్లో 37 సార్లు ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో నాథన్ లియాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 43 మ్యాచ్‌ల్లో 187 వికెట్లు తీశాడు. లియాన్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకోవాలంటే బెంగళూరు టెస్టులో అశ్విన్ 3 వికెట్లు మాత్రమే తీయాల్సి ఉంది. అశ్విన్ ఇప్పటివరకు 37 మ్యాచ్‌లు ఆడి 185 వికెట్లు తీశాడు.
2024లో టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఏ భారతీయ బ్యాట్స్‌మెన్ కూడా 1000 పరుగుల మార్కును దాటలేదు. బెంగళూరు టెస్టులో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ రికార్డులకెక్కవచ్చు. ఇప్పటి వరకు ఆడిన 8 టెస్టుల్లో 929 పరుగులు చేశాడు. ఈ విధంగా జైస్వాల్ ఇంకా 71 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంటుంది.
విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్‌లో ఇప్పటివరకు ఎన్నో భారీ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. బెంగళూరు టెస్టులో 9000 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 8947 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్‌ల క్లబ్‌లో చేరాలంటే కింగ్ కోహ్లీ 53 పరుగులు చేయాల్సి ఉంది.
టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. తన కెరీర్‌లో 103 టెస్టుల్లో 90 సిక్సర్లు కొట్టాడు. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మ బెంగళూరు టెస్టులో కేవలం 4 సిక్సర్లు మాత్రమే బాదాల్సి ఉంటుంది. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 61 టెస్టుల్లో 87 సిక్సర్లు బాదాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..