IND vs HK: సూర్య మెరుపులు.. కోహ్లీ క్లాస్‌ ఇన్నింగ్స్‌.. హాంకాంగ్‌పై భారత్‌ ఘనవిజయం.. సూపర్‌-4 రౌండ్‌లోకి ప్రవేశం

|

Sep 01, 2022 | 8:33 AM

India vs Hong Kong, Asia Cup 2022: ఆసియా కప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా టీమిండిమా మరో అడుగు ముందుకేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టోర్నీలోని గ్రూప్ దశలో తమ రెండో మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను సులభంగా ఓడించింది.

IND vs HK: సూర్య మెరుపులు.. కోహ్లీ క్లాస్‌ ఇన్నింగ్స్‌.. హాంకాంగ్‌పై భారత్‌ ఘనవిజయం.. సూపర్‌-4 రౌండ్‌లోకి ప్రవేశం
Indian Cricket Team
Follow us on

India vs Hong Kong, Asia Cup 2022: ఆసియా కప్‌లో టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా టీమిండిమా మరో అడుగు ముందుకేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టోర్నీలోని గ్రూప్ దశలో తమ రెండో మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను సులభంగా ఓడించింది. తద్వారా సూపర్‌-4 రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ , విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలతో మెరిశారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేయగలిగింది. సూర్యకుమార్ కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. కోహ్లీ కూడా 44 బంతుల్లో 59 రన్స్‌ చేశాడు. వీరిద్దరు కలిసి అభేద్యమైన మూడో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంకాంగ్‌ కూడా స్ఫూర్తిదాయక ఆటతీరును ప్రదర్శించింది. మొత్తం 20 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మెరుపు ఇన్నింగ్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్ పురస్కారం లభించింది.

మళ్లీ నిరాశపర్చిన రాహుల్‌

హాంకాంగ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ ఆ జట్టు రెండు విభాగాల్లో ఖచ్చితంగా ఆకట్టుకుంది. టీమ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాహుల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగారు. అయితే నాలుగో ఓవర్లోనే హిట్‌మ్యాన్‌ పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత రాహుల్, విరాట్ కోహ్లీ పరుగులు చేసేందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా హాంకాంగ్‌ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో రాహుల్‌ చాలా ఇబ్బంది పడ్డారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లో 59 పరుగులు జోడించారు. రాహుల్ చాలా సేపు క్రీజులో ఉన్నా భారీస్కోరు చేయలేకపోయాడు. వన్డేల కంటే నెమ్మదిగా మరీ బ్యాటింగ్‌చేసి ఆడి ఔటయ్యాడు. 13వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోరు 2 వికెట్లకు 94 పరుగులు కాగా, అక్కడి నుంచి సూర్యప్రతాపం మొదలైంది. ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను స్వీప్ చేసి బౌండరీలకు పంపించిన అతను తన ఉద్దేశాన్ని ఆదిలోనే చాటి చెప్పాడు. ఇక మరో ఎండ్‌లో కోహ్లి 40 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్‌లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్సర్లు సాధించి, కేవలం 22 బంతుల్లో ఫిఫ్టీని అందుకున్నాడు. ఆఖరి ఓవర్లో సూర్య మొత్తం 26 పరుగులు పిండుకున్నాడు. కోహ్లి 44 బంతుల్లో (1 ఫోర్, 3 సిక్సర్లు) 59 పరుగులతో అజేయంగా వెనుదిరిగాడు.

 

ఓడినా ఆకట్టుకున్నారు

కాగా భారీ స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన హాంకాంగ్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్‌లో యాసిమ్ మొర్తజా వికెట్ కోల్పోయింది. అయితే బాబర్ హయత్ (41) ధాటిగా ఆడాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ ధాటిగా ఆడి పవర్‌ప్లేలోనే జట్టును 50 రన్స్‌ దాటించాడు. అయితే రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌లు రావడంతో ఆ జట్టు తన పరుగుల వేగాన్ని కొనసాగించలేకపోయింది. అయితే చివరి ఓవర్లలో హాంకాంగ్ బ్యాటింగ్‌ ఆకట్టుకుంది. అవేష్ ఖాన్‌18వ ఓవర్‌లో జీషన్ అలీ (26 పరుగులు, 17 బంతుల్లో), స్కాట్ మెక్‌హిన్నీ (16 పరుగులు, 8 బంతుల్లో) మొత్తం 2 సిక్స్‌లు, 2 ఫోర్లతో 21 పరుగులు పిండుకున్నారు. ఇక అర్ష్‌దీప్‌ వేసిన ఓవర్‌లోనూ 12 పరుగులు రావడంతో ఆజట్టు స్కోరు 150 పరుగులు దాటింది. టీమిండియా బౌలర్లలో అవేశ్‌ ఖాన్ (4 ఓవర్లు, 53 పరుగులు, 1 వికెట్), అర్ష్‌దీప్ (4 ఓవర్లు, 44 పరుగులు, 1 వికెట్) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..