India vs England: ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్ గెలవాలన్న 15 ఏళ్ల భారత జట్టు కల ఇప్పట్లో తీరేలా లేదు. సుమారు10 నెలల క్రితం 2-1 ఆధిక్యం సంపాదించి అందరి ప్రశంసలు అందుకున్న టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రీషెడ్యూల్ టెస్ట్‌లో మాత్రం ఊహించని ఓటమిని ఎదుర్కొంది. ఈ టెస్ట్‌లో మూడున్నర రోజులు, సుమారు ఏడున్నర సెషన్ల పాటు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించిన భారత జట్టు.. ఆతర్వాతి మూడు సెషన్లలోనే ఇంగ్లండుకు లొంగిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 378 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జో రూట్, జానీ బెయిర్‌స్టో రికార్డు భాగస్వామ్యంతో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తద్వారా చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను 2-2 తో సమం చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లలో జోరూట్ (142), జానీ బెయిర్ స్టో (114) శతకాలతో అదరగొట్టారు.
టీమిండియా ఆశలపై నీళ్లు..
కాగా గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా 2-1 ఆధిక్యంలో ఉండగా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి చారిత్రక సిరీస్ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే రూట్, బెయిర్‌స్టో భారత జట్టు ఆశలపై నీళ్లు పోశారు. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 245 పరుగులకే కుప్పకూలింది భారత జట్టు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల బలమైన ఆధిక్యంతో ఇంగ్లండ్‌కు 378 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని అందుకుంది. అయితే ఈ టెస్టుకు ముందు, ఇంగ్లండ్ న్యూజిలాండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌లలో 270 కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే ఇంగ్లండ్ కేవలం 3 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసి విజయానికి బాటలు వేసుకుంది. ఇక ఐదో రోజు ఆటలో కూడా తన దూకుడును కొనసాగించింది. భారత బౌలర్లు రూట, బెయిర్ స్టోలను ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. వీరిద్దరూ కేవలం గంటన్నర ఆటలోనే మిగిలిన 159 పరుగులను సాధించి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసి సిరీస్‌ను సమం చేశారు. గత కొన్ని వారాలుగా ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలు చేసిన ఈ ఇద్దరు బ్యాటర్లు చివరి రోజు మరింత వేగంగా బ్యాటింగ్ చేశారు. రూట్ 82 స్ట్రైక్ రేట్‌తో కెరీర్‌లో 28వ సెంచరీని సాధించగా.. బెయిర్‌స్టో 78 స్ట్రైక్ రేట్‌తో 115 పరుగులు చేశాడు. అతనికిది వరుసగా నాలుగో టెస్ట్ సెంచరీ కాగా ఓవరాల్ గా 12వది. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ శతకాలు బాది ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన బెయిర్ స్టోకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
England win the Edgbaston Test by 7 wickets.
A spirited performance by #TeamIndia as the series ends at 2-2. #ENGvIND pic.twitter.com/fNiAfZbSUN
— BCCI (@BCCI) July 5, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..