
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజులోకి అడుగుపెట్టింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా తరఫున యశస్వి జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61), రిషబ్ పంత్ (54) హాఫ్ సెంచరీలు చేశారు. ఈ హాఫ్ సెంచరీల సాయంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ తరఫున జాక్ క్రాలీ (84), బెన్ డకెట్(94) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఒలీ పోప్ 71 పరుగులు చేశాడు. ఇక జో రూట్ 150 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు 500 పరుగుల మార్కును దాటింది.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 544 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ 77 పరుగులతో, ఆల్ రౌండర్ లియామ్ డాసన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. నాలుగో రోజు ఆటలో స్టోక్స్, డాసన్ తమ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను ముగించడానికి టీమిండియాకు ఇంకా మూడు వికెట్లు కావాలి. ముఖ్యంగా బెన్ స్టోక్స్, లియామ్ డాసన్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాబట్టి, ఇంగ్లాండ్ జట్టు మొదటి రెండు సెషన్లలో భారీ స్కోరు సాధించడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే 186 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్, కనీసం 250 పరుగుల ఆధిక్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే, ఇంగ్లాండ్ 600 పరుగులు చేయకుండా డిక్లేర్ చేసే అవకాశం లేదు.
ఇంగ్లాండ్ జట్టు కనీసం 200 పరుగుల ఆధిక్యం సాధిస్తే, టీమిండియా ముందు డ్రా అనే ఒకే ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో చివరి 2 సెషన్లలో టీమిండియా బ్యాటింగ్ చేసినా 200 నుండి 300 పరుగుల వరకు మాత్రమే చేయగలదు. అంతేకాకుండా, ఐదో రోజు ఆటలో కూడా బ్యాటింగ్‌ను కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ టీమిండియా దూకుడుగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసినా, ఇంగ్లాండ్‌కు కేవలం 150 పరుగుల లక్ష్యమే లభిస్తుంది. అంటే, తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 200 పరుగుల ఆధిక్యం సాధిస్తే, భారత్ 350 పరుగులు చేసినా, ఇంగ్లాండ్‌కు తక్కువ టార్గెట్ లభిస్తుంది. కాబట్టి, ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడమే భారత్ ముందున్న దారి.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 127 సార్లు 150+ పరుగుల వెనుకబడి ఉంది. ఈ సందర్భాల్లో టీమిండియా 93 సార్లు ఓడిపోయింది, 32 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. గెలిచింది మాత్రం కేవలం 2 మ్యాచ్‌లలో మాత్రమే. అంటే, 150+ పరుగుల వెనుకబడితే టీమిండియా ఎక్కువ సార్లు ఓడిపోయిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. కాబట్టి, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచే అవకాశం చాలా తక్కువ. ఈ కారణంతోనే భారత జట్టు గెలవడానికి ప్రయత్నించకుండా, మ్యాచ్‌ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీని ద్వారా చివరి టెస్ట్ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను డ్రాగా ముగించవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..