
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తన అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీసిన భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, మైదానం బయట కూడా తన చమత్కారంతో వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను చేసిన ఒక సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సీరియస్‌గా సమాధానాలు ఇస్తున్న సమయంలో, అక్కడే ఉన్న ఒక విలేకరి ఫోన్ రింగ్ అవ్వడం మొదలైంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి అటువైపు మళ్లింది.
ఆ సమయంలో బుమ్రా ఏమాత్రం తడుముకోకుండా, “ఎవరి భార్యో కాల్ చేస్తోంది. నేను మాత్రం ఫోన్ తీయను” అని నవ్వుతూ చమత్కరించాడు. అతని ఆకస్మిక స్పందనకు, చమత్కారానికి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు బుమ్రా సమయస్ఫూర్తిని, హాస్య చతురతను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
“Somebody’s wife is calling!”
Jasprit Bumrah reacts to a reporter’s phone going off during a press conference 😂❤️#ENGvsIND #Bumrah pic.twitter.com/kLrZHCLDVW— Nivas Manepalli (@SrinivasManep10) July 12, 2025
కేవలం మాటలతోనే కాకుండా, బుమ్రా తన బౌలింగ్‌తోనూ అదరగొట్టాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 74 పరుగులిచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. దీంతో లార్డ్స్ గౌరవ సూచిక బోర్డుపై తన పేరును లిఖించుకున్నాడు. ఈ ఘనత సాధించిన 14వ భారత బౌలర్‌గా నిలిచాడు. అతని అద్భుత ప్రదర్శన వల్లే ఇంగ్లాండ్‌ను 387 పరుగులకు కట్టడి చేయగలిగారు.
ఒకవైపు తన పదునైన బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూనే, మరోవైపు ఇలాంటి సరదా సంఘటనలతో అభిమానులను అలరించడం బుమ్రాకే చెల్లింది. ఈ సంఘటనతో “సీరియస్ బౌలర్” వెనుక ఒక “సరదా మనిషి” కూడా ఉన్నాడని మరోసారి నిరూపితమైంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..