IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌లో స్పిన్ మాయాజాలం.. అరుదైన రికార్డులు సృష్టించిన అశ్విన్, జడేజా..

|

Feb 17, 2023 | 4:53 PM

ఆసీస్ జట్టుపై టీమిండియా తరఫున 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించగా.. టెస్ట్ క్రికెట్‌లో 250 వికెట్ల క్లబ్‌లో..

IND vs AUS 2nd Test: రెండో టెస్ట్‌లో స్పిన్ మాయాజాలం.. అరుదైన రికార్డులు సృష్టించిన అశ్విన్, జడేజా..
Jadeja And Ashwin
Follow us on

బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించారు. ఆసీస్ జట్టుపై టీమిండియా తరఫున 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ రికార్డు సృష్టించగా.. టెస్ట్ క్రికెట్‌లో 250 వికెట్ల క్లబ్‌లో జడేజా చేరాడు. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా.. టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే(111 వికెట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు అశ్విన్. ఇక ఈ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 263 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తరఫున మొహమ్మద్ షమి 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ఆశ్విన్, జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు.

అలెక్స్‌ కారే వికెట్‌తో ఆసీస్‌పై వంద వికెట్లు..

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ రెండో టెస్ట్‌ తొలి రోజు అశ్విన్ ఈ ఘనత సాధించాడు. తొలి రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలెక్స్‌ కారేను డకౌట్‌ చేసి.. ఆసీస్‌పై వంద వికెట్ల మార్కును అందుకున్నాడు అశ్విన్. ఈ జాబితాలో సమకాలీన క్రికెటర్లలో రవీంద్ర జడేజా(71) తప్ప అశ్విన్‌ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. ఇదిలా ఉంటే.. ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దివంగత ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ 195 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

2500 రన్స్‌తో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా జడేజా..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో తీసిన మొదటి వికెట్ ద్వారా..  250 వికెట్లు పడగొట్టిన ఎలైట్ బౌలర్ల జాబితాలో జడేజా చేరాడు. ఈ టెస్టులో ఖవాజాను ఔట్‌ చేసిన జడ్డూ.. ఈ ఫీట్‌ నమోదు చేశాడు. దీంతో పాటు మరిన్ని రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న ఎనిమిదో భారత బౌలర్‌గా జడ్డూ నిలిచాడు. ఈ జాబితాలో కుంబ్లే, అశ్విన్‌, కపిల్‌ దేవ్‌, హర్భజన్ , జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. అదే విధంగా.. టెస్టు‍ల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన నాలుగో భారత క్రికెటర్‌గా జడేజా గుర్తింపు సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో అనిల్‌ కుంబ్లే, అశ్విన్, కపిల్‌ దేవ్‌ జడ్డూ కంటే ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 2500 రన్స్‌తో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా జడేజా రికార్డు క్రియేట్ చేశాడు. జడేజా 62 టెస్టుల్లోనే ఈ ఫీట్‌ నమోదు చేశాడు. అయితే, ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డు సాధించిన జాబితాలో జడేజా రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్‌ దిగ్గజం ఇయాన్ బోథమ్ ఉన్నాడు. బోథమ్ ఈ రికార్డును కేవలం 55 టెస్టుల్లోనే సాధించడం విశేషం.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..